రివైండ్ 2024: ఈ ఏడాది బిగ్ స్క్రీన్ మీద కనిపించని హీరోలు!
టాలీవుడ్ హీరోలంతా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకూ అందరూ వరుసగా ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు
టాలీవుడ్ హీరోలంతా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకూ అందరూ వరుసగా ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. అయితే 2024లో బిగ్ స్క్రీన్ మీద కనిపించని స్టార్స్ చాలామందే ఉన్నారు. కారణాలు ఏవైనా ఈ సంవత్సరంలో ఒక్క సినిమాని కూడా ఆడియన్స్ కు అందించలేకపోయారు. ఆ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి గతేడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. 'వాల్తేరు వీరయ్య' హిట్టయినా, 'భోళా శంకర్' డిజాస్టర్ గా మారడంతో కాస్త స్పీడ్ తగ్గించారు. ఈ ఏడాది ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేదు. అప్పటి నుంచీ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' ప్రాజెక్ట్ మీదనే వర్క్ చేస్తున్నారు. దాదాపు టాకీ పార్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని, 2025 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ 'గేమ్ చేంజర్' కోసం వాయిదా వేసుకున్నారు. దీంతో చిరు సినిమా వచ్చే సమ్మర్ కు షిఫ్ట్ అవ్వాల్సి వస్తోంది.
2023లో 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి డబుల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. గడిచిన ఏడాది కాలంలో మరో సినిమాని విడుదల చేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడం కూడా బాలయ్య నుంచి సినిమా రాకపోవడానికి ఒక కారణంగా చెప్పాలి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్న 'డాకు మహారాజ్' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ 2: తాండవం' చిత్రాన్ని ప్రారంభించారు. 2025 దసరా సందర్భంగా సెప్టెంబర్ 25n థియేటర్లలోకి తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది బాలయ్య నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి.
2022లో RRR, ఆచార్య సినిమాల్లో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రెండున్నర ఏళ్లుగా మరో సినిమాని అందించలేకపోయారు. లాస్ట్ ఇయర్ మాత్రం సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన హిందీ మూవీలో తళుక్కున మెరిశాడు. ఈ ఏడాది మొత్తం 'గేమ్ చేంజర్' షూటింగ్ లోనే గడిపేశారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి స్పెషల్ గా జనవరి 10న రానుంది. ఇటీవలే బుచ్చిబాబు సినిమాని కూడా చెర్రీ సెట్స్ మీదకు తీసుకొచ్చారు.
గడిచిన ఏడాది 'కస్టడీ' సినిమాతో ఫ్లాప్ అందుకున్న యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. అప్పటి నుంచి 'తండేల్' మూవీతో ట్రావెల్ చేస్తున్నారు. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సర్వైవల్ లవ్ యాక్షన్ డ్రామా వచ్చే వాలెంటైన్స్ డే వీక్ లో ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ మధ్యనే కార్తీక్ దండు దర్శకత్వంలో చైతూ 'NC 24' మూవీని అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ సోలోగా సినిమా చేసి మూడేళ్లు అయింది. లాస్ట్ ఇయర్ మాత్రం రెండు చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేశారు.
అక్కినేని వారసుడు, యూత్ కింగ్ అఖిల్ కూడా బిగ్ స్క్రీన్ మీదకు వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. 'ఏజెంట్' డిజాస్టర్ గా మారడంతో అయ్యగారు తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మురళీ కిశోర్ అబ్బూరుతో 'Akhil 6' సినిమా కమిట్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో షూట్ కూడా చేశారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి, షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇది కాకుండా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ కుమార్ డైరెక్షన్ లో అఖిల్ ఓ మూవీకి సైన్ చేసినట్లు తెలుస్తోంది.
లాస్ట్ ఇయర్ 'విరూపాక్ష', 'బ్రో' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ కు ఈ ఏడాది ఒక్క రిలీజ్ కూడా లేదు. ప్రస్తుతం తేజ్ 'SDT 18' మూవీలో నటిస్తున్నారు. ఆయన తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ గతేడాది 'ఆదికేశవ' సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న మెగా మేనల్లుడు ఇప్పటి వరకూ తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. పోయిన ఏడాది 'అమిగోస్', డెవిల్' సినిమాతో వచ్చిన నందమూరి కల్యాణ్ రామ్.. ఏడాది కాలంగా 'NKR 21' ప్రాజెక్ట్ మీదనే ఉన్నారు.
అడివి శేష్ వెండి తెర మీద కనిపించి రెండేళ్లు దాటింది. ప్రస్తుతం అతను 'G 2', 'డెకాయిట్ ' చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక 2023 చివర్లో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో హిట్టు కొట్టిన నవీన్ పోలిశెట్టి.. తనకు జరిగిన యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. అందుకునే ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయారు. ఇటీవలే కోలుకున్న యువ హీరో త్వరలోనే 'అనగనగా ఒక రాజు' అనే సినిమాతో రానున్నారు.
మంచు బ్రదర్స్ కూడా చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు. విష్ణు చివరగా 2022లో 'జిన్నా' మూవీతో వచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'కన్నప్ప' సినిమా 2025 ఏప్రిల్ 25న విడుదల కానుంది. మరోవైపు మనోజ్ బిగ్ స్క్రీన్ మీద కనిపించి ఆరేళ్ళు అయింది. 'ఒక్కడు మిగిలాడు' (2017) తర్వాత కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా చాలా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం 'భైరవం', 'మిరాయ్' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.
బెల్లంకొండ బ్రదర్స్ సాయి శ్రీనివాస్, గణేష్ ఇద్దరూ ఈ ఏడాది ఒక్క సినిమాని కూడా రిలీజ్ చెయ్యలేదు. శ్రీనివాస్ నటిస్తున్న 'భైరవం' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇది కాకుండా 'టైసన్ నాయుడు' తో సహా మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. లాస్ట్ ఇయర్ 'నేను స్టూడెంట్ సర్' సినిమాతో ఆడియన్స్ ను పలకరించిన గణేష్.. తన తదుపరి చిత్రాల గురించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు.