వేధింపులపై శాశ్వత పరిష్కార కమిటీకి ఇంకెన్నాళ్లు?
తొలిసారి టాలీవుడ్ లో లైంగిక ఆరోపణల అంశం తెరపైకి తెచ్చింది శ్రీరెడ్డి అన్న సంగతి తెలిసిందే.
తొలిసారి టాలీవుడ్ లో లైంగిక ఆరోపణల అంశం తెరపైకి తెచ్చింది శ్రీరెడ్డి అన్న సంగతి తెలిసిందే. అప్పటి వరకూ ఎలాంటి ఆరోపణలు లేకుండా సాగిపోతున్న టాలీవుడ్ లో శ్రీరెడ్డి రేపిన ప్రకంపనతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది. ఛాంబర్ ఎదుటే ...మీడియాని పిలిపించి అర్దనగ్న ప్రదర్శనకు దిగడంతో దేశ వ్యాప్తంగా టాలీవుడ్ గురించి చర్చించుకుంది. అవకాశాల పేరుతో తనని వంచించారని శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ వైపు దేశమే తొంగి చూసింది.
శ్రీరెడ్డి లాంటి మరెంతో మంది జూనియర్ ఆర్టిస్టులు తెరపైకి వచ్చారు. దీంతో జాతీయ మీడియాలో తెలుగు సినీ పరిశ్రమపై ఎన్నో కథనాలు వైరల్ అయ్యాయి. దీంతో అప్పటి తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రభుత్వం....అప్పటి చాంబర్ ప్రతినిధులు ముందుకొచ్చి లైంగిక బాధితలకు మద్దతుగా పరిశ్రమలో కమిటీ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి ఆరోపణలు రాలేదు. చిత్ర పరిశ్రమలో ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు.
మళ్లీ సరిగ్గా ఆరేళ్ల తర్వాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వద్ద శిష్యరికం చేసిన ఓ యువతి జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసాడంటూ చేసిన ఆరోపణతో టాలీవుడ్ మళ్లీ ఉలిక్కి పండింది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక మాలీవుడ్ ని షేక్ చేస్తోన్న వేళ ఓ యువతి లైంగిక ఆరోపణ చేయడంతో టాలీవుడ్ వైపు మళ్లీ అందరి దృష్టి పడింది. టాలీవుడ్ పై ఈ మచ్చ ఏంటనే? చర్చ మొదలైంది. హేమ కమిటీ నివేదిక పై ఎవరి అభిప్రాయాలు వారు పంచుకుంటోన్న సమయంలోనే సమంత టాలీవుడ్ లో గత ప్రభుత్వం వేసిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేసారు.
ఆమెకు మద్దతుగా మరికొంత నటీమణులు నిలుస్తున్నారు. దీనిపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇక జానీ మాస్టర్ విషయంలో బాధిత మహిళకు టాలీవుడ్ పరిష్కార కమిటీ అండగా నిలబడిం ది. ఇంకా బాధిత మహిళలు ఎవరైనా ఉంటే? ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయాలని కోరింది. అలాగే ఛాంబర్ తరుపున దీనికి సంబంధించి శాశ్వత కమిటీ ఒకటి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంది. అయితే ఈప్రయత్నం 2018 నుంచి జరుగుతూనే ఉంది కానీ ఇంతవరకూ సాధ్య పడలేదు.