2023 రివ్యూ : టాలీవుడ్ అతి పెద్ద డిజాస్టర్స్
2023 ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాలు హిట్ కొట్టినా ఆ తర్వాత వచ్చిన పెద్ద సినిమాల్లో చాలా వరకు నిరాశ మిగిల్చాయి
కాల గర్భంలో 2023 సంవత్సరం కూడా కలవబోతుంది. మరో పదిహేను రోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే 2023 లో కూడా సినిమా ఇండస్ట్రీకి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాలేదు. ఫెయిల్యూర్స్ లో సక్సెస్ లను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఈ ఏడాది కూడా ఉంది. చాలా సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.
2023 ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాలు హిట్ కొట్టినా ఆ తర్వాత వచ్చిన పెద్ద సినిమాల్లో చాలా వరకు నిరాశ మిగిల్చాయి. సమ్మర్ సీజన్ లో అఖిల్ ఏజెంట్ సినిమా విడుదల అయింది. ఆ సినిమా కి విపరీతమైన బడ్జెట్ ను పెట్టారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా పెట్టుబడి లో కనీసం 10 శాతం కూడా వెనక్కి రాబట్టలేక పోయిందనే టాక్ వచ్చింది.
సమంత తో గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన శాకుంతలం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ప్రభావంను కనబర్చలేదు. సమంత నటనకు మంచి మార్కులు పడ్డా కూడా ఓవరాల్ గా సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ మూవీగా నిలిచింది.
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఏ స్థాయిలో అంచనాలను మోసుకు వచ్చిందో అందరికి తెల్సిందే. సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యం లో వచ్చిన కలెక్షన్స్ ను చూస్తే కచ్చితంగా డిజాస్టర్ అనడంలో సందేహం లేదు అనేది బాక్సాఫీస్ వర్గాల మాట. పాన్ ఇండియా రేంజ్ లో సాధిస్తుంది అనుకున్న వసూళ్లలో కనీసం 40 శాతం కూడా ఆదిపురుష్ రాబట్టలేక పోయింది.
పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో పాటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, భోళా శంకర్, రామబాణం, స్కంద, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, గాంఢీవదారి అర్జున, రంగబలి, దసరా, చంద్రముఖి 2 ఇలా చాలా సినిమాలు అంచనాలకు తగ్గట్లుగా వసూళ్లు దక్కించుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. మరి వచ్చే ఏడాది అయినా ఇలాంటి క్రేజీ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటాయేమో చూడాలి.