సినీ ప్రియులకు పండుగే పండుగ!

ఇలా రాబోయే ఐదు నెలల కాలంలో ఆడియన్స్ ను అలరించడానికి, పలు క్రేజీ చిత్రాలు రిలీజులు ప్లాన్ చేసుకున్నాయి. కాకపోతే వీటిల్లో కొన్ని చిత్రాల విడుదల తేదీలలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

Update: 2024-07-29 18:54 GMT

టాలీవుడ్ లో 2024 ఫస్టాఫ్ లో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. సెకండాఫ్ ను 'కల్కి 2898 AD' సినిమా ఘనంగా ప్రారంభించింది. రాబోయే ఐదు నెలలు సినీ ప్రియులకు కనువిందు చేసేందుకు అనేక చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఆగస్టు మొదలు కొని, డిసెంబర్ చివరి వారం వరకూ బాక్సాఫీసు దగ్గర సందడి చేయడానికి పలు భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ఫిలిం మేకర్స్ రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేయగా.. మరికొందరు లాక్ చేసిన తేదీలను ఇంకా ప్రకటించలేదు.

ఆగస్టులో మొదటి వారంలో అల్లు శిరీష్ 'బడ్డీ', అశ్విన్ బాబు 'శివం భజే', రాజ్ తరుణ్ 'తిరగబడరా సామి', కె. విజయ్ భాస్కర్ 'ఉషా పరిణయం', 'యావరేజ్ స్టూడెంట్ నాని' సినిమాలు విడుదల కాబోతున్నాయి. మెగా డాటర్ సమర్పిస్తున్న 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా 8 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిల్లో నాలుగు తెలుగు చిత్రాలు, ఒక తమిళ డబ్బింగ్ మూవీ, మూడు హిందీ మూవీస్ ఉన్నాయి.

పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమాతో పాటుగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న 'ఆయ్'.. రానా దగ్గుబాటి సమర్పిస్తున్న '35 - చిన్న కథ కాదు' సినిమాలు అదే రోజున వస్తున్నాయి. పా. రజింత్, విక్రమ్ కలయికలో రూపొందే 'తంగలాన్' సినిమాతో పాటుగా.. స్త్రీ 2, వేదా, ఖేల్ ఖేల్ మే వంటి హిందీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. 23వ తారీఖున రావు రమేష్ 'మారుతీనగర్ సుబ్రహ్మణ్యం' సినిమా విడుదల కానుంది.

ఆగస్టు నెలాఖరున 29వ తేదీన నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రూపొందే 'సరిపోదా శనివారం' సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో మూడు చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. 5వ తేదీన విజయ్ నటిస్తున్న తమిళ్ డబ్బింగ్ మూవీ 'ది గోట్'.. 7న వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన 'లక్కీ భాస్కర్' మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటి మధ్యలో 6వ తేదీన నారా రోహిత్ 'సుందరకాండ' రానుంది.

అల్లరి నరేష్ నటించిన 'బచ్చల మల్లి' మూవీని సెప్టెంబర్ 13న విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. 20వ తేదీన 'ట్రాన్స్‌ఫార్మర్స్ వన్' అనే హలీవుడ్ డబ్బింగ్ సినిమా రానుంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న 'దేవర: పార్ట్ 1' సెప్టెంబరు 27న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. గోపీచంద్ తో శ్రీను వైట్ల తీస్తున్న 'విశ్వం' చిత్రాన్ని అక్టోబర్ 4న తీసుకురావాలని చూస్తున్నారు. సూర్య నటిస్తున్న 'కంగువ' అనే తమిళ అనువాద చిత్రం దసరా కానుకగా అక్టోబరు 10న విడుదల కానుంది.

కిరణ్ అబ్బవరం స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న 'కా'(KA) సినిమా అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబర్ 30న విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' మూవీ విడుదల అవుతుంటే.. 31న శివ కార్తికేయన్ 'అమరన్' తెలుగు డబ్బింగ్ వెర్షన్ రానుంది. రజనీకాంత్ నటిస్తున్న 'వెట్టయాన్'.. అజిత్ కుమార్ 'విదా ముయార్చి' చిత్రాలు కూడా అక్టోబరులోనే థియేటర్లలోకి రానున్నాయి. ఎక్కువ శాతం విజయ దశమికే విడుదలయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికైతే నవంబర్ లో తెలుగు సినిమాలేవీ రిలీజ్ డేట్లు ప్రకటించలేదు. 1వ తారీఖున 'సింగం ఎగైన్', 'భూల్ భూలయ్యా 3' లాంటి రెండు హిందీ చిత్రాలు రానున్నాయి. అదే నెల 22వ తేదీన 'ధడక్ 2' మూవీ వస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' సినిమా పాన్ ఇండియా వైడ్ గా డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. అదే రోజున బ్రహ్మానందం చిత్రం విడుదల అవుతుందని అంటున్నారు. మంచు విష్ణు ప్రతిష్టాత్మక మూవీ 'కన్నప్ప' ను కుదిరితే 13వ తేదీన తీసుకొస్తారని టాక్.

ఈ ఏడాది క్రిస్మస్ పండక్కి పోటీ ఎక్కువైంది. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న 'తండేల్' సినిమాని డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అదే రోజున నితిన్ 'రాబిన్‌హుడ్' కూడా వస్తుందంటూ అధికారిక ప్రకటనలు వచ్చాయి. అయితే రామ్ చరణ్, ఎస్. శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని క్రిస్మస్ కు రిలీజ్ చేస్తామని నిర్మాత అనౌన్స్ చేశారు. అమీర్ ఖాన్ నటిస్తున్న 'సితారే జమీన్ పర్' సినిమా డిసెంబరు 25వ తేదీకి షెడ్యూల్ చేయబడింది. ఇలా రాబోయే ఐదు నెలల కాలంలో ఆడియన్స్ ను అలరించడానికి, పలు క్రేజీ చిత్రాలు రిలీజులు ప్లాన్ చేసుకున్నాయి. కాకపోతే వీటిల్లో కొన్ని చిత్రాల విడుదల తేదీలలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News