టాలీవుడ్ మారింది..మార్కెట్ పెరిగింది కానీ హీరోలు మాత్రం!

మ‌న సినిమా అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఎదురు చూడ‌ట‌మే కాకుండా మ‌న మార్కెట్ స్థాయి కూడా పెరిగింది

Update: 2023-09-02 02:45 GMT

టాలీవుడ్ గురించి చెప్పాల్సి వ‌స్తే 'బాహుబ‌లి'కి ముందు..బాహుబ‌లికి త‌రువాత అని చెప్పాల్సిందే. ఎందుకంటే 'బాహుబ‌లి'తో తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంత‌రాల‌కు పాకింది. తెలుగు వాళ్లు కూడా హాలీవుడ్ స్థాయి సినిమాలు తీయ‌గ‌ల‌ర‌ని నిరూపించింది. అంతేనా ఇండియ‌న్ సినిమా అంటే మేమే అంటూ యావ‌త్ ప్ర‌పంచ సినిమాకు చాటి చెప్పిన బాలీవుడ్ మేక‌ర్స్ ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యంతో, అక్క‌సుతో న‌లిగిపోయేలా చేసింది. మ‌న సినిమా రైజ్ కావ‌డంతో బాలీవుడ్ డౌన్ ఫాల్ కావ‌డం మొద‌లైంది. మ‌న సినిమా అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఎదురు చూడ‌ట‌మే కాకుండా మ‌న మార్కెట్ స్థాయి కూడా పెరిగింది.

'బాహుబ‌లి' వ‌ల్ల తెలుగు సినిమా మార్కెట్ పెర‌గ‌డంతో ఫ్లాపులున్న హీరోలు కూడా నాలుగైదు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. హిట్ అనే మాట విన్న సినిమా కూడా భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. అంతేనా మ‌న స్టార్ల రెమ్యున‌రేష‌న్‌లు కూడా చుక్క‌ల‌ని అంటుతున్నాయి. ఒక్కో స్టార్ హీరో 50 కోట్ల మేర వ‌సూలు చేస్తుండ‌గా ప‌వ‌న్ 'బ్రో' కోసం కేవ‌లం 21 డేస్‌కే ఈ రెమ్యున‌రేష‌న్ అందుకున్నార‌ని వార్త‌లు వినిపించాయి. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ బాహాటంగానే చెప్పేయ‌డంతో అంతా అవాక్క‌య్యారు.

ఈ విష‌యంలో ఆద్యుడిగా నిలిచిన ప్ర‌భాస్ కూడా ఇంత‌కు రెండింత‌లు తీసుకుంటున్నార‌ట‌. మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ త‌దిత‌రు స్టార్ హీరోలు 50 నుంచి వంద వ‌ర‌కు డిమాండ్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఈ స్థాయికి చేరితే హీరోలు చాలా వ‌ర‌కు మార‌లేద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. దీనికి ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు ఏ.ఎస్‌. ర‌వికుమార్ చౌద‌రి చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నం. సినిమా మారింది కానీ కొతం మంది హీరోలు ఇంకా మార‌లేద‌ని ఏ.ఎస్‌. ర‌వికుమార్ చౌద‌రి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌లనంగా మారిన విష‌యం తెలిసిందే.

ఆయ‌న మాట‌ల్లోనూ నిజ‌ముంద‌ని కొంత మంది హీరోలు నిరూపిస్తున్నారు కూడా. ఒక డైరెక్ట‌ర్‌తో సినిమా ప్రారంభించి దాన్ని సెట్స్ పైకి వెళ్ల‌కుండానే ఆపేస్తున్నారు. మ‌రి కొంత మంది డైరెక్ట‌ర్ ఉన్నా కాని అన్నీ తామై చూసుకుంటూ డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌ని ప‌క్క‌న పెట్టేస్తున్నారు. రీసెంట్‌గా మ‌హేష్ 'గుంటూరు కారం'ని ముందు అనుకున్న క‌థ‌తో కాకుండా కొత్త క‌థ‌తో చేస్తుండ‌టం తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు మారిన ట్రెండ్‌కు అనుగుణంగా కాకుండా త‌మ‌కు అనువుగా ఉందా? లేదా అని లెక్క‌లు వేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇందుకు మిన‌హాయింపేమీ కాదు. 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' సినిమానే ఇందుకు ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌. ఈ సినిమా మొద‌లై మూడేళ్లు దాటినా ఇంత‌కూ ముందుకు క‌ద‌ల‌డం లేదు. ద‌ర్శ‌కుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వ‌డం లేద‌నే కామెంట్‌లు త‌ర‌చూ వినిపిస్తూనే ఉన్నాయి. ఇది ఎప్ప‌టికి పూర్త‌వుతుందో కూడా తెలియ‌ద‌ని అందులో న‌టిస్తున్న వాళ్లే కౌంట‌ర్లు వేస్తున్నారని గుస గుస‌లు వినిపిస్తున్నాయి. పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వ‌ర‌కు చాలా మంది ఇంకా మార‌లేద‌ని, ఇప్ప‌టికీ అదే యాటిట్యూడ్‌తో వ‌ర్క్ చేస్తున్నార‌నే ప్ర‌చారం ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. హీరోల్లో అది ఎప్పుడు పోతుందో అప్పుడు టాలీవుడ్‌లో మ‌రిన్ని మంచి సినిమాలు వెలుగు చూస్తాయ‌ని, యావ‌త్ ప్ర‌పంచ సినిమా టాలీవుడ్ వైపు ఆశ్చ‌ర్యంగా చూస్తుందని ఇండస్ట్రీలోని ఓ వ‌ర్గం కామెంట్ చేస్తోంది.

Tags:    

Similar News