కామెడీతో వారికి గట్టి పోటీనిస్తాడా?

టాలీవుడ్ సీనియర్ మోస్ట్ కమెడియన్లలో అలీ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. గత మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Update: 2024-08-07 03:55 GMT

టాలీవుడ్ లో ఇప్పుడు కావాల్సినంత మంది కమెడియన్లు ఉన్నారు. జబర్థస్త్ షో క్లిక్ అయిన తర్వాత చాలామంది వర్ధమాన హాస్యనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎంతమంది వచ్చినా, ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సత్య, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ప్రవీణ్, సుదర్శన్ లాంటి ఈతరం కమెడియన్లు వచ్చిన తరువాత, సీనియర్ కమెడియన్ల జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. అలాంటి వారిలో అలీ కూడా ఉన్నారు.

 

టాలీవుడ్ సీనియర్ మోస్ట్ కమెడియన్లలో అలీ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. గత మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. హాస్య నటుడిగానే కాకుండా హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, టీవీ వ్యాఖ్యాతగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొంత కాలంగా అలీ హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. కొత్త కమెడియన్స్ వచ్చిన తర్వాత ఆయన కెరీర్ కాస్త స్లో అయినట్లు అనిపిస్తోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయం మీద ఆలీ మాట్లాడుతూ.. మంచి సినిమాల్లో భాగమవ్వాలనే ఉద్దేశ్యంతో ఆచితూచి పాత్రలు ఎంచుకుంటున్నట్లుగా తెలిపారు. కథతో పాటుగా తన క్యారెక్టర్, హీరో, డైరెక్టర్ కూడా తనకు చాలా ముఖ్యమని చెప్పారు. ఇప్పుడు "డబుల్ ఇస్మార్ట్" సినిమాలో అలీకి మంచి పాత్ర దొరికినట్లుగా తెలుస్తోంది. పూరీ జగన్నాధ్ ఆయన కోసం రాసిన కామెడీ ట్రాక్ థియేటర్లో బాగా పేలుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు కమెడియన్ అలీ ఒక సెంటిమెంట్. కెరీర్ ప్రారంభం నుంచీ తన సినిమాల్లో ఆయన కోసం స్పెషల్ కామెడీ ట్రాక్స్ డిజైన్ చేస్తూవస్తున్నారు. కథతో సంబంధం లేకుండా అలీతో కామెడీ క్రియేట్ చేస్తుంటారు. 'ఇడియట్' లో మోటార్ సైకిల్ దొంగగా అలీని చూపించిన పూరీ.. 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రంలో హీరో ఫ్రెండ్ అప్పల రాజుగా సెపరేట్ ట్రాక్ రాసి ఒక సాంగ్ కూడా పెట్టారు. పూరీ తీసిన 'శివమణి'లో హీరోతో పాటు ఉండే రజనీకాంత్‌ పాత్ర ఇచ్చారు అలీకి.

'సూపర్' మూవీలో జాన్ అబ్రహం అనే ఆర్టిస్ట్ పాత్రలో బ్రహ్మానందంతో కలిసి చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. 'పోకిరి'లో బిచ్చగాళ్ల సంఘం అధ్యక్షుడిగా అలీ.. బ్రహ్మీతో నడిపించే ట్రాక్ చాలా బాగా పేలింది. 'దేశముదురు' సినిమాలో అలీ కోసం క్రియేట్ చేసిన హిమాలయన్ బాబా పాత్ర భలే వర్కవుట్ అయింది. 'చిరుత'లో నచ్చిమి అంటూ అలీ చేసే హంగామా అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. 'బుజ్జిగాడు' మూవీలోనూ సర్పరాజు కాట్రే, బొకాడియా, కుఫ్లీ అంటూ రకరకాల పేర్లతో అలీ పాత్ర అలరిస్తుంది.

ఏక్ నిరంజన్, గోలిమార్, నేను నా రాక్షసి, దేవుడు చేసిన మనుషులు, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో, హార్ట్ ఎటాక్, టెంపర్, లోఫర్, పైసా వసూల్, లైగర్ వంటి చిత్రాలలో అలీకి మంచి పాత్రాలు ఇచ్చారు పూరీ జగన్నాథ్. ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలోనూ సీనియర్ కమెడియన్ కోసం సెపరేట్ కామెడీ ట్రాక్ రాశారు. అమెజాన్ ఫారెస్ట్ లో మాట్లాడుకునే ఒక భాషను కనిపెట్టి మరీ ఈ క్యారెక్టర్‌ను క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది.

అలీ పాత్ర తీరుతెన్నులు, లుక్, గెటప్, భాష అన్నీ విభిన్నంగా ఉంటాయని 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఈ కామెడీ ట్రాక్ బాగా పండితే ఖచ్చితంగా అలీకి మళ్ళీ మరిన్ని ఆఫర్లు వచ్చి కెరీర్ స్పీడ్ అందుకునే అవకాశం ఉంది. అందులోనూ రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికారు కాబట్టి, ఇకపై సినిమాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నారు. కాకపోతే యంగ్ కమెడియన్స్ నుంచి పోటీని తట్టుకొని అలీ ఎలా ముందుకు సాగుతారో చూడాలి.

Tags:    

Similar News