అత్య‌ధిక సినిమాల క్ల‌బ్‌లో టాలీవుడ్‌ టాప్ -5 హీరోలు

ఇటీవ‌ల పాన్ ఇండియా రిలీజ్.. పాన్ వ‌ర‌ల్డ్ రిలీజ్! అంటూ సినిమాల రిలీజ్ తీరు అమాంతం మారిపోయింది.

Update: 2024-09-24 15:30 GMT

భార‌తీయ సినిమా 110 సంవ‌త్స‌రాల సుదీర్ఘ మ‌నుగ‌డ‌తో అసాధార‌ణంగా ఎదిగింది. నేడు 1000 కోట్ల వ‌సూళ్ల క్ల‌బ్ సాధ్య‌మ‌వుతోంది. వెయ్యి కోట్లు అంత‌కుమించిన వ‌సూళ్ల క్ల‌బ్ లో అర‌డ‌జ‌ను మంది భార‌తీయ‌ హీరోలు ఉన్నారు. అంచెలంచెలుగా పెరిగిన బ‌డ్జెట్లు, టైమ్ ఫ్రేమ్, మేకింగ్ క్వాలిటీ, టెక్నాలజీ ..ఇలా అన్ని కోణాల్లోను ఎదుగుద‌ల క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల పాన్ ఇండియా రిలీజ్.. పాన్ వ‌ర‌ల్డ్ రిలీజ్! అంటూ సినిమాల రిలీజ్ తీరు అమాంతం మారిపోయింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జ‌పాన్, కొరియా స‌హా ఇండియ‌న్ డ‌యాస్పోరా ఉన్న అన్ని చోట్లా మ‌న సినిమాలు భారీగా విడుద‌లవుతున్నాయి. మొద‌టి మూడు రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అసంఖ్యాక‌మైన థియేట‌ర్ల‌లో సినిమాని రిలీజ్ చేసి రాబ‌ట్టాల్సిన‌దంతా రాబ‌ట్టే ట్రేడ్ ఎత్తుగ‌డ‌ను చూస్తున్నాం.

అయితే ఇంత‌టి ఎదుగుద‌ల‌కు మునుపు గొప్ప‌ పునాది వేసిన నాటిత‌రం క్లాసిక్ డే హీరోల‌ను నేటిత‌రం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా వందేళ్లు పైబ‌డిన భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో 90 ఏళ్లు పైగా మ‌నుగ‌డ సాగించి, ఎంతో ఎత్తుకు ఎదిగిన టాలీవుడ్ కి మూల స్థంబాలు అయిన లెజెండ‌రీ హీరోల‌ను గుర్తు చేసుకుంటే, వారంతా స్థిరంగా చిత్త‌శుద్ధితో అధిక శ్ర‌మ‌తో తెలుగు సినిమా స్థాయిని పెంచారు. అంత‌గా సాంకేతిక‌త ఎద‌గ‌ని రోజుల్లో ఎంతో హార్డ్ వ‌ర్క్, గొప్ప‌ ఎఫ‌ర్ట్ తో తెలుగు సినిమాకి ఉన్న‌త స్థాయిని అందించిన హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు వంటి వారి గురించి చ‌రిత్ర లిఖిత‌మై ఉంది.

రోజులో మూడు కాల్షీట్ల‌లో న‌టించిన హీరోగా సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు పేరుంది. గోల్డెన్ డేస్ హీరోల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి లెజెండ్‌ల‌తో పోటీప‌డుతూ సూప‌ర్ స్టార్ గా ఎదిగారు కృష్ణ‌. లెజెండ్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుంచి క్ర‌మ‌శిక్ష‌ణ‌ను అందిపుచ్చుకుని పోటీబ‌రిలో ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ దూసుకుపోయారు. ఇత‌రుల‌తో పోలిస్తే అత్యంత వేగంగా సినిమాలు చేసేవారు. ఏడాదికి పాతిక సినిమాల్లో న‌టించిన స్పీడ్ ఆయ‌న సొంతం. అందుకే కృష్ణ -357 సినిమాల‌తో టాలీవుడ్ హీరోల్లోనే అత్య‌ధిక చిత్రాల్లో న‌టించిన హీరోగా నిలిచారు. ఆ త‌ర్వాత న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముడు, అన్న‌గారు ఎన్టీఆర్ -302 చిత్రాల‌తో ద్వితీయ స్థానంలో నిలిచారు. రాజ‌కీయాల్లోను తెలుగు దేశం పార్టీ స్థాపించి ఎన్టీఆర్ స‌త్తా చాటారు. అక్కినేని అంద‌గాడిగా, మ‌హిళ‌ల గుండెల్లో మారాజుగా వెలిగిపోయిన మ‌రో లెజెండ‌రీ న‌టుడు ఏఎన్నార్-255 సినిమాల‌తో అత్య‌ధిక సినిమాల్లో న‌టించిన హీరోల్లో మూడో స్థానంలో ఉన్నారు.

ఎన్టీఆర్- ఏఎన్నార్ త‌ర్వాతి త‌రంలో కృష్ణ‌, శోభ‌న్ బాబు విభిన్న‌మైన ఇమేజ్ ఉన్న స్టార్లుగా ఎదిగారు. కృష్ణ‌తో పోటీప‌డుతూ న‌టించిన శోభ‌న్ బాబు 231 సినిమాల్లో న‌టించారు. ఇద్ద‌రు క‌థానాయిక‌ల స‌ర‌స‌న చందురుడిలా వెలిగిపోయిన శోభ‌న్ బాబు... లెజెండ్ ఏఎన్నార్ వార‌సుడిగా గొప్ప మ‌హిళా ఫాలోయింగ్ ని ఆస్వాధించారు. ఇక తెలుగు చిత్ర‌సీమ‌లో ఆజానుభాహుడిగా యాక్ష‌న్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన కృష్ణంరాజు మొత్తం-190 సినిమాల్లో న‌టించారు. ఆయ‌న‌లోని రెబ‌లిజాన్ని ప్రేక్ష‌కులు అమితంగా ఆరాధించారు గ‌నుక `రెబ‌ల్ స్టార్` అన్న బిరుదు వ‌చ్చింది. అయితే సినిమా డైన‌మిక్స్ అన్నీ మారుతున్న క్ర‌మంలో క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు మీనింగ్ చెప్పిన స్టార్ గా మెగాస్టార్ చిరంజీవి త‌న‌దైన శైలిలో దూసుకుపోయారు. చిరంజీవి -155 సినిమాల్లో న‌టించి ఇప్పుడు కెరీర్ 156వ సినిమాలో న‌టిస్తున్నారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వెళ్లి నాలుగేళ్లు వృధా చేయ‌క‌పోతే క‌చ్ఛితంగా మ‌రో 15 సినిమాల్లో అద‌నంగా న‌టించి ఉండేవారు. మ‌న మేటి హీరోలంతా తెలుగు సినిమా ఎదుగుద‌ల‌లో కీల‌క భాగ‌స్వాములు అంటే అతిశ‌యోక్తి కాదు.

Tags:    

Similar News