గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్: 100 కోట్ల తేడా.. ఎవరిని నమ్మాలి?
శుక్రవారం విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో తడబడినట్లు కామెంట్స్ వచ్చాయి. రివ్యూలు కూడా అంతగా పాజిటివ్ గా రాలేదు.
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు ఒక 20 రోజుల ముందు నుంచే భారీ అంచనాలను సెట్ చేసింది. అంతకుమించి ఇండియన్ 2 ఎఫెక్ట్ తో శంకర్ పై డౌట్ తో ఉన్న ఫ్యాన్స్ కు ట్రైలర్ నమ్మకం కలిగించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో తడబడినట్లు కామెంట్స్ వచ్చాయి. రివ్యూలు కూడా అంతగా పాజిటివ్ గా రాలేదు.
అయితే అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా హడావుడి బాగానే చేసింది. చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్ళపైనే అందరి ఫోకస్ పడింది. పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదలైన గేమ్ ఛేంజర్, మొదటి రోజున మంచి వసూళ్లను సాధించినట్లు సమాచారం. అయితే, మొదటి రోజు కలెక్షన్ల విషయంలో మేకర్స్ - బాక్సాఫీస్ ట్రాకర్స్ మధ్య చాలా తేడా కనిపించడం చర్చనీయాంశమైంది.
బాక్సాఫీస్ ట్రాకర్స్ ప్రకారం, గేమ్ ఛేంజర్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు సుమారు 85 కోట్లుగా ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుండి అందిన డేటా ప్రకారం..సీడెడ్ ఏరియా గ్రాస్ 7.6 కోట్లు, తమిళనాడు గ్రాస్ 2.5 కోట్లు, గుంటూరు షేర్ 3.7 కోట్లు కాగా, పశ్చిమ గోదావరి 2.05 కోట్లు (హైర్స్‌తో కలిపి) వసూలు చేసినట్లు వివరించారు. ఇంకా నైజాం ఓవర్సీస్ కు సంబంధించిన లెక్కలు కూడా కలుపుకుని లెక్క 85 కోట్ల వరకు చేరినట్లు చెబుతున్నారు.
అదే సమయంలో, మేకర్స్ మాత్రం తమ పోస్టర్ ద్వారా మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు 185 కోట్లుగా ప్రకటించారు. ఈ భారీ తేడా సినీ ప్రేమికులను, ట్రేడ్ వర్గాలను ఆలోచింపజేస్తోంది. ట్రాకర్స్ మరియు మేకర్స్ మధ్య ఇంత పెద్ద డిఫరెన్స్ ఎందుకు వచ్చిందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితుల్లో ఎవరి డేటా నిజమో నిర్ణయించుకోవడం ప్రేక్షకులకు సవాలుగా మారింది.
ట్రేడ్ అనలిస్టులు సాధారణంగా థియేటర్ల నుండి వచ్చిన గణాంకాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ మేకర్స్, బిజినెస్, ఇతర ఆదాయాల ఆధారంగా కూడా మొత్తం గ్రాస్‌ను ప్రకటించే అవకాశం ఉంటుంది. సినీ పరిశ్రమలో వసూళ్లపై ఉండే ఈ తేడా కొత్తేమీ కాదు. పలు సినిమాల విడుదల సమయంలో ఇలాంటి గణాంకాలు భిన్నంగా ఉండడం చూస్తూనే ఉన్నాం.
అంతే కాకుండా ఫ్యాన్స్ కోసమే ఆ నెంబర్లు వేస్తామని పలువురు నిర్మాతలు కూడా డైరెక్ట్ గానే ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి.
అయితే, ప్రేక్షకులు, ట్రేడ్ అనలిస్టుల మధ్య తేడా తక్కువ శాతం ఉంటుంది. కానీ ఈసారి గేమ్ ఛేంజర్ విషయంలో ఏకంగా 100 కోట్ల తేడా చూపడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అంతిమంగా, గేమ్ ఛేంజర్ ఆడే పద్ధతే నిజమైన విజయాన్ని నిర్ణయిస్తుంది. వసూళ్లు ఎన్ని వచ్చినా, సినిమా కథ, నటన, మేకింగ్ మీద ఆధారపడి ప్రేక్షకుల నుండి వచ్చే స్పందనే అసలు విజయం అని చెప్పవచ్చు. ఇక వీకెండ్ బుకింగ్స్ ను బట్టి సినిమా అసలు ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.