‘తెలుగులో ఇది సరిపోదు.. అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా’
ఇప్పుడు ఓపెన్ డయాస్ మీద.. ఎవరేం అనుకుంటారన్న ఆలోచన లేకుండా.. సభ్యత.. సంస్కారాన్ని పక్కన పెట్టేసి పచ్చిగా మాట్లాడేయటం అలవాటుగా మారుతోంది.
వెండి తెర మీద బూతు డైలాగులతో చెలరేగిపోయే దర్శకుల్ని చూశాం. ఇప్పుడు ఓపెన్ డయాస్ మీద.. ఎవరేం అనుకుంటారన్న ఆలోచన లేకుండా.. సభ్యత.. సంస్కారాన్ని పక్కన పెట్టేసి పచ్చిగా మాట్లాడేయటం అలవాటుగా మారుతోంది. త్వరలో విడుదల కానున్న 'మజాకా' చిత్ర దర్శకుడు త్రినాధరావు నక్కిన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. తన సినిమా ప్రమోషన్ కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నోటి దూల చూసినోళ్లు అవాక్కు కావటమే కాదు.. ఇలా మాట్లాడటమా?అంటూ షాక్ తింటున్న పరిస్థితి.
నటి అన్షూపై త్రినాధరావు చేసిన వ్యాఖ్యల వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. వివాదాస్పద రీతిలో చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ''మన్మథుడు సినిమా అప్పుడు హీరోయిన్ అన్షూ అడ్డులాగా ఉండేవారు. ఆమెను చూడడానికే సినిమాకు వెళ్లేవాళ్లం. ఓ రేంజ్ లో ఉండేవారు. కానీ.. అప్పటి కంటే ఆమె కొంచెం సన్నబడ్డారు. తెలుగులో ఇది సరిపోదు. కొంచెం తిని పెంచమ్మా. అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పాను. ఫర్లేదు.. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. నెక్ట్స్ టైంకు బాగా ఇంప్రూవ్ అవుతారు’ అంటూ మాట్లాడారు.
దర్శకుడి మాటల వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు.. ఇదే వేదిక మీద మరో నటి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు.. ‘బాగుంది. ఈ ఏడాది మొదటి టచ్’ అంటూ వెకిలిగా మాట్లాడిన మాటలకు విస్తు పోతున్నారు. మహిళల్ని గౌరవించటం ఇలాంటి వ్యక్తుల కారణంగా సినిమా ఇండస్ట్రీ మర్యాదను కోల్పోతుందన్న మాట చిత్ర పరిశ్రమకు చెందిన వారు సైతం తమ ప్రైవేటు సంభాషణల్లో మాట్లాడుకోవటం కనిపిస్తోంది. ఇలా మాట్లాడిన వారి విషయంలో చర్యలు ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సినిమాకు వస్తే.. మజాకా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. సందీప్ కిషన్.. రీతూ వర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అన్షూ.. రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. ఈ కథ వింటున్నప్పుడే రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా నవ్వానని.. ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని నిర్మాతల్లో ఒకరైన రాజేశ్ దండా పేర్కొన్నారు. సినిమా చూసి నవ్వటం తర్వాత.. దర్శకుడి మోటు మాటలు విన్న తర్వాత.. సినిమాకు వెళ్లటానికి అసలు ఇష్టపడతారా? అన్నది ప్రశ్నగా మారిందంటున్నారు.