FORBES ఇంటర్వ్యూలో ట్రిప్తీ సంచలన వ్యాఖ్యలు
తనకు ఉన్న బోల్డ్ ఇమేజ్ కారణంగా కొన్ని పాత్రల్లో అవకాశాలు పోగొట్టుకుంటోందన్న పుకార్ షికార్ చేస్తోంది.
'యానిమల్' చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో హీటెక్కించింది ట్రిప్తి దిమ్రీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే గాక, ఇందులో ట్రిప్తీ నటనకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత బ్యాడ్ న్యూజ్,'విక్కీ విద్యా కా వో వాలా' వీడియో వంటి చిత్రాల్లోను ట్రిప్తీ నటించింది. యానిమల్, బ్యాడ్ న్యూజ్ లో బోల్డ్ పాత్రల కారణంగా చాలా కాలంగా విమర్శల్ని కూడా ఎదుర్కొంటోంది ఈ బ్యూటీ. తనకు ఉన్న బోల్డ్ ఇమేజ్ కారణంగా కొన్ని పాత్రల్లో అవకాశాలు పోగొట్టుకుంటోందన్న పుకార్ షికార్ చేస్తోంది.
అయితే తాను పాత్ర డిమాండ్ మేరకు యానిమల్ లో బోల్డ్ గా నటించానని ట్రిప్తీ దిమ్రీ గతంలో మీడియాకు తెలిపింది. ఇప్పుడు మరోసారి ప్రఖ్యాత 'ఫోర్బ్స్' ఇంటర్వ్యూలో ట్రిప్తి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ''మనల్ని ఇష్టపడేవాళ్లు ఉంటారు. ఇష్టపడని వాళ్లు ఉంటారు. ఇష్టపడని వాళ్ల గురించి సినిమాలు చేయలేమ''ని ట్రిప్తి దిమ్రీ బహిరంగంగా వ్యాఖ్యానించింది. మనల్ని అందరూ ఇష్టపడరని కూడా అంది. తన ఎంపికల గురించి తనకు ఎటువంటి విచారం లేదని విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.
యానిమల్ - బాడ్ న్యూజ్‌లలో తన పాత్రలపై కామెంట్ల విషయంలో తాను ఆశ్చర్యపోలేదని ట్రిప్టీ వెల్లడించింది. నేను వంద శాతం ఇవ్వాలనుకునే నటిని. పాత్ర లేదా కథ నాకు ఆసక్తికరంగా అనిపిస్తే నా సర్వస్వం ఇవ్వాలనుకుంటున్నాను. నేను నేర్చుకున్నది అదే.. అది పనిచేస్తే పనిచేస్తుంది .. పనిచేయకపోతే పని చేయదు. మనల్ని ఎల్లప్పుడూ అందరూ ఇష్టపడరు. మనల్ని ఇష్టపడే వ్యక్తులు కొందరు ఉంటారు. ఇష్టపడని వారు కొందరు ఉంటారు. మనకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయాలి! అని ట్రిప్తీ చెప్పింది.
బోల్డ్ ఇమేజ్ ని విడిచిపెట్టి దూరంగా వెళుతున్నారా? అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని, నేను ప్రవాహంతో పాటు వెళుతున్నానని ట్రిప్తి అన్నారు. నేను సెట్‌కి వెళ్లి బోర్ కొట్టే పని చేయను.. విభిన్న పాత్రలను పోషించడమే నా లక్ష్యం. నేను సవాల్‌గా భావించి ఎలా చేయగలనో ఆలోచిస్తాను.. ప్రతిదీ సుసాధ్యం చేస్తాను! అని కాన్ఫిడెంట్ గా చెప్పింది. వైవిధ్యంగా, కొత్తగా ఏదైనా చేయాలని భావించడం వల్లనే యానిమల్ లో జోయా పాత్రలో నటించానని కూడా ట్రిప్తి తెలిపింది. రాజ్‌కుమార్ రావు 'విక్కీ విద్యా కా వో వాలా వీడియోలో విద్య పాత్రను పోషించాలనుకోవడానికి కారణం తన ఆలోచనా వైవిధ్యాన్ని చెప్పాలనే ప్రయత్నమేనని వివరించింది.
అయితే ట్రిప్తీకి ఉన్న శృంగార నటి ఇమేజ్‌తో చిక్కులు ఉన్నాయని, దీంతో 'ఆషిఖి 3' నుంచి తనను తొలగించారని పుకార్లు షికార్ చేస్తున్నాయి. స్వచ్ఛమైన ప్రవర్తన ఉన్న నటి కావాలని దర్శకుడు వెతుకుతున్నట్టు కథనాలొచ్చాయి. అయితే అనురాగ్ బసు ఈ వాదనలను ఖండించారు.
ట్రిప్తి తదుపరి విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న 'అర్జున్ ఉస్తారా'పై దృష్టి సారించింది. ఈ చిత్రంలో మొదట కార్తీక్ ఆర్యన్ నటించాల్సి ఉంది కానీ ఇప్పుడు షాహిద్ కపూర్ నటించనున్నారు. సిద్ధాంత్ చతుర్వేది సరసన 'ధడక్ 2'లోను ట్రిప్తీ నటించనుంది.