'యానిమ‌ల్' సీక్వెల్‌పై ట్రిప్తి ఏమందంటే?

`యానిమ‌ల్` ముందు- `యానిమల్` త‌ర్వాత త‌న కెరీర్ గురించి విశ్లేషించింది ట్రిప్తి దిమ్రీ.

Update: 2024-07-27 08:30 GMT

`యానిమ‌ల్` ముందు- `యానిమల్` త‌ర్వాత త‌న కెరీర్ గురించి విశ్లేషించింది ట్రిప్తి దిమ్రీ. యానిమ‌ల్ సినిమాతో త‌న‌కు గొప్ప గుర్తింపు వ‌చ్చింద‌ని, అంత‌కుముందు తాను న‌టించిన సినిమాల‌ను కూడా ఆ త‌ర్వాత‌ వీక్షిస్తున్నార‌ని, పెరిగిన త‌న ఫాలోయింగ్ గురించి చాలా ఆనందం వ్య‌క్తం చేసింది. ఓటీటీలోను త‌న‌కు విప‌రీత‌మైన క్రేజ్ పెరిగిన విష‌యాన్ని గుర్తించాన‌ని.. యానిమ‌ల్ సినిమాని ఓటీటీలో చూసి ఎక్కువ‌మంది త‌న‌కు అభిమానులయ్యార‌ని కూడా అంగీక‌రించింది.

ఆస‌క్తిక‌రంగా `యానిమ‌ల్` చిత్రం ఓవ‌ర్ నైట్ స్టార్ ని చేయ‌డ‌మే కాదు.. ట్రిప్తి దిమ్రీకి నేష‌న‌ల్ క్ర‌ష్ అనే బిరుదును కూడా తెచ్చింది. అయితే అలాంటి కీల‌క‌మైన ఫ్రాంఛైజీలో తాను భాగం కాబ‌ట్టి ట్రిప్తీకి ప్ర‌తిసారీ యానిమ‌ల్ పార్క్ గురించి ఒక ప్రశ్న ఎదుర‌వుతూనే ఉంది. దీనికి ఇప్పుడు స్పందిస్తూ తాను కూడా చాలా మంది అభిమానుల్లానే యానిమ‌ల్ పార్క్ గురించి ఎదురు చూస్తున్నాన‌ని, కానీ ఆ సినిమా ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంది? అనేది త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పింది. క‌థేమిటి? షూట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అనేది కూడా త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు.

అలాగే యానిమ‌ల్ సినిమాపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇలాంటివి సినిమాల విష‌యంలో చాలా స‌హ‌జం! అని కూడా ట్రిప్తి వ్యాఖ్యానించింది. ప్ర‌తి ఒక్క‌రూ ఇలాంటివి ఏదో ఒక స‌మ‌యంలో ఎదుర్కోవాల్సిందే. అలాగే యానిమ‌ల్ లో న‌టించినందుకు చాలా మంది నుంచి చాలా నేర్చుకున్నాన‌ని కూడా ట్రిప్తి వెల్ల‌డించింది. యానిమ‌ల్ విజ‌యం త‌న‌లో చాలా ఆనందాన్ని నింపింద‌ని తెలిపింది. ట్రిప్తి న‌టించిన బ్యాడ్ న్యూజ్ ఇటీవ‌ల విడుద‌లై నెగెటివ్ స‌మీక్ష‌ల‌ను అందుకుంది. కానీ అద్భుత‌మైన‌ ఓపెనింగులు సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విక్కీ కౌశ‌ల్, అమీ విర్క్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

లైలా మజ్ను, బుల్బుల్, ఖలా వంటి చిత్రాల్లో ట్రిప్తి గ‌తంలో నటించింది. యానిమ‌ల్ లో జోయా పాత్ర కంటే మంచి పాత్ర‌లు చేసింది. కానీ అప్పుడు రాని గుర్తింపు యానిమ‌ల్ త‌ర్వాత మాత్ర‌మే త‌న‌కు ద‌క్కింది. ఏదైనా ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లో న‌టిస్తే దాని ప్ర‌భావం ఎలా ఉంటుందో చెప్పేందుకు యానిమ‌ల్ విజ‌యం ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. యానిమల్ తర్వాత నేషనల్ క్రష్ అని ట్యాగ్ అందుకోవ‌డ‌మే కాదు..ఇటీవ‌ల‌ ఎక్కువ మంది ప్రజలు ఖలా, బుల్బుల్‌ని చూస్తున్నారని ట్రిప్తీ గ‌త ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

ఇప్పుడు పూర్తి స్థాయిలో టేకాఫ్ అయిన తన కెరీర్ విషయానికొస్తే...``ఇప్పుడు త‌న‌కు అవ‌కాశాల ప‌రంగా కొద‌వే లేద‌``ని తెలిపింది. నేను పెద్ద తెర‌- ఓటీటీ తెర‌ల మ‌ధ్య‌ సమతుల్యతను కొనసాగించాలనుకుంటున్నాను. నాకు సవాలుగా ఉండే పని మాత్రమే కావాలి. అది OTT నా లేక పెద్ద తెర అవ‌కాశ‌మా అన్న‌ది ఆలోచించను అని కూడా గ‌తంలో తెలిపింది. ట్రిప్తి త‌దుప‌రి ఆషిఖి 3లో న‌టిస్తోంది. దీంతో పాటు ప‌లు ఫ్రాంఛైజీ చిత్రాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంది.

Tags:    

Similar News