రీమేక్ కి ఆమె చాలా స్పెషల్..!
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'కిల్' ను తమిళ్, తెలుగులో రాఘవ లారెన్స్ రీమేక్ చేసేందుకు సిద్ధం అయ్యారనే విషయం తెల్సిందే.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'కిల్' ను తమిళ్, తెలుగులో రాఘవ లారెన్స్ రీమేక్ చేసేందుకు సిద్ధం అయ్యారనే విషయం తెల్సిందే. నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో రూపొందిన కిల్ సినిమాలో హీరోగా రాఘవ్ జుయల్ నటించగా హీరోయిన్‌గా తాన్య మానిక్తల నటించింది. ప్రస్తుతం సౌత్‌లో రీమేక్ అవ్వబోతున్న కిల్ సినిమా రీమేక్ లో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ ఉండగా, హీరోయిన్ పాత్రను త్రిష తో చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె డిమాండ్ చేసిన పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని, ఆమె ఈ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దాదాపు ఖాయం అనే టాక్ తమిళ సినీ వర్గాల నుంచి, మీడియా సర్కిల్స్ నుంచి వినిపిస్తోంది.
రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ కిల్ రీమేక్ లో త్రిష నటిస్తే కచ్చితంగా ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం. తెలుగు, తమిళ వర్షన్‌ల కోసం చాలా మార్పులు చేస్తున్నారు, ఆ మార్పులు హీరోయిన్ కి ప్రాముఖ్యత పెరిగే విధంగా ఉంటాయని సమాచారం అందుతోంది. మొత్తానికి కిల్ రీమేక్ లో త్రిష ను అంతకు మించి అన్నట్లుగా చూపించడం ద్వారా కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను ఈ రీమేక్ వైపు తీసుకు వచ్చే ఆలోచనలో దర్శకుడు రమేష్ వర్మతో పాటు హీరో లారెన్స్ ఉన్నారని తెలుస్తోంది. లారెన్స్ కు జోడీగా త్రిష ఎలా ఉంటుంది అనే విషయమై సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం అందుతోంది.
త్రిష ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి అయినా ఇంకా అదే జోరుతో సినిమాలు చేస్తూనే ఉంది. ఆ మధ్య టాలీవుడ్‌కి దూరంగా ఉన్నా రీసెంట్‌గా టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. హీరోయిన్ గా ఈమె చిరంజీవికి జోడీగా విశ్వంభర సినిమాలో నటించింది. రెండు మూడు రోజుల షూట్ మినహా మొత్తం షూటింగ్ ను త్రిష పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో ఆ షూట్ సైతం ముగించే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి తో త్రిష పాటలకు సంబంధించిన షూటింగ్ సైతం పూర్తి అయిందట. మొత్తానికి విశ్వంభర ముగించిన వెంటనే త్రిష కు కిల్ వంటి సూపర్ హిట్ రీమేక్ లో ఛాన్స్ రావడం జరిగింది. ఇది కచ్చితంగా ఆమె కి మంచి పరిణామం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
లారెన్స్ ఒక వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూ మరో వైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. విభిన్నమైన కథలను, కాన్సెప్ట్‌లను ఎంపిక చేసుకుంటూ ఆయన సినిమాలు చేస్తూ ఉన్నాడు. కిల్ సినిమా ఆయనకు మరో విజయాన్ని సొంతం చేయడం ఖాయం. రమేష్ వర్మ ఈ మధ్య కాలంలో రీమేక్ లకు మంచి ఆప్షన్ గా మారాడు. ఇటీవల ఆయన చేసిన రీమేక్ లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా సైతం రమేష్ వర్మకు దర్శకుడిగా మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవడం ఖాయం. లారెన్స్ ఇటీవల చేసిన చంద్రముఖి 2 సినిమా నిరాశ పరచిన నేపథ్యంలో కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి కిల్ తో లారెన్స్ పూర్వ వైభవం దక్కించుకుంటాడా అనేది చూడాలి.