బన్నీ మెచ్చిన త్రివిక్రమ్ 'కాన్సెప్ట్' అదేనా?

ఇందులో భాగంగానే బన్నీ కోసం ఓ కొత్త కాన్సెప్ట్ ను రెడీ చేస్తున్నారని సమాచారం. అయితే ఇది పురాణాలు ఇతిహాసాల స్పూర్తితో తీసే సోషియో ఫాంటసీ మూవీ అని అప్పట్లో టాక్ నడిచింది.

Update: 2024-07-20 08:12 GMT

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ 'హీరో - డైరెక్టర్' కాంబినేషన్స్ లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరిద్దరి కలయికలో ఇప్పటి వరకూ వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. 'జులాయి', 'S/o సత్యమూర్తి' చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిస్తే, 'అల వైకుంఠపురములో' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో దర్శక హీరోలు నాలుగో సినిమా కోసం చేతులు కలపబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. తాజాగా అల్లు అర్జున్ సన్నిహితుడు నిర్మాత బన్నీ వాస్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాకి లైన్ ఫిక్స్ అయిందని బన్నీ వాసు తెలిపారు. అది భారీ బడ్జెట్ ఫిల్మ్ అని, దీని కోసం నిర్మాతలు అంత ఫైనాన్స్ చేసే కార్పొరేట్స్ ను ఫైనాన్సియర్లను వెతుక్కోవాలని అన్నారు. త్రివిక్రమ్ కు పాన్ ఇండియా సినిమా తీసే సామర్థ్యం వుందని బన్నీకి చాలా నమ్మకం ఉంది.. వీళ్లిద్దరూ రెండేళ్లుగా మాట్లాడుకుని ఒక లైన్ ఫిక్స్ అయ్యారని చెప్పారు. కథ కంటే ఇది ఒక కాన్సెప్ట్ అని బన్నీ వాస్ పేర్కొన్నారు. ఇది చాలా బిగ్ ప్రాజెక్ట్ అని, దాని ప్రీ ప్రొడక్షన్‌కే ఏడాదిన్నర సమయం పడుతుందని బన్నీ వాస్ అన్నారు. దీంతో బన్నీ మెచ్చిన త్రివిక్రమ్ 'కాన్సెప్ట్' ఏంటబ్బా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లే చేశారు. ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఈ మధ్య కాలంలో అయితే అలాంటి కంటెంట్ నుంచి బయటకు రావడం లేదు. హిట్టయినా ఫ్లాప్ అయినా అదే టెంప్లేట్ తో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈసారి కుటుంబం నేపథ్యంలో సినిమా వద్దని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కోరుకున్నారు. 'పుష్ప' తో పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత, అల్లు అర్జున్ రేంజ్ తగ్గ అసాధారణమైన కంటెంట్ తో రావాలని ఆశిస్తున్నారు.

అభిమానులు కోరుకున్నట్లు నిజంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి అల్లు అర్జున్ కోసం తన రూట్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకునే చిత్రాలకే పరిమితమైన దర్శకుడు.. ఇప్పుడు పాన్ ఇండియాని టార్గెట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే బన్నీ కోసం ఓ కొత్త కాన్సెప్ట్ ను రెడీ చేస్తున్నారని సమాచారం. అయితే ఇది పురాణాలు ఇతిహాసాల స్పూర్తితో తీసే సోషియో ఫాంటసీ మూవీ అని అప్పట్లో టాక్ నడిచింది.

త్రివిక్రమ్ తన సినిమాల్లో పురాణాలు ఇతిహాసాలను భాగం చేస్తుంటారు. ఏదో సందర్భంలో రామాయణం, మహాభారతాలకు సంబంధించిన డైలాగులు వినిపిస్తుంటాయి. ఎందుకంటే వాటి మీద ఆయనకు అంత పట్టుంది. మహాభారతం స్ఫూర్తితోనే అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా టాక్ వచ్చింది. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ, ఇప్పుడు బన్నీ వాస్ మాటలతో మరోసారి బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ చర్చకు వచ్చింది. ఇది గీతా ఆర్ట్స్ & హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కనుంది.

Tags:    

Similar News