ఇద్దరినీ ఒకేసారి చూడటం ఆనందం : త్రివిక్రమ్
తాజాగా జరిగిన లక్కీ భాస్కర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా హాజరు అయిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మించిన 'లక్కీ భాస్కర్' సినిమా దీపావళి సందర్భంగా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మధ్య కాలంలో దుల్కర్ సల్మాన్ కి మలయాళంలో కంటే తెలుగు లో ఎక్కువ మంది ఫాలోయింగ్ దక్కింది. ముఖ్యంగా సీతారామం సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుసగా సినిమాలు చేయాలని కోరుకుంటున్న వారు ఎక్కువ అయ్యారు. లక్కీ భాస్కర్ హిట్ అయితే అలా కోరుకునే వారి సంఖ్య మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తాజాగా జరిగిన లక్కీ భాస్కర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా హాజరు అయిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ దుల్కర్ సల్మాన్ పై తన అభిమానంను చాటుకున్నారు. అదే కార్యక్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. లక్కీ భాస్కర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ... ఈతరం హీరోల్లో నాకు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ అంటే చాలా అభిమానం, వారిద్దరినీ ఇలా ఒకే స్టేజ్ పై చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దుల్కర్ సల్మాన్ మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను అంటూ త్రివిక్రమ్ అన్నారు.
ఈ సినిమాను చూస్తున్నంత సేపు ప్రేక్షకులు దుల్కర్ తో ట్రావెల్ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దుల్కర్ బ్యాంక్‌లోకి వెళ్తే బ్యాంక్ కి వెళ్లినట్లు, ఎక్కడ ఉంటే తాము అక్కడ ఉన్నట్లుగా ప్రేక్షకులు ఫీల్ అయ్యే విధంగా దర్శకుడు అద్భుతంగా సినిమాను రూపొందించారు. ప్రతి మిడిల్ క్లాస్ వాడు బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటాడు. ఒకవేళ తాను డబ్బు సంపాదించలేక పోయినా తోటి మిడిల్ క్లాస్ వాడు డబ్బు సంపాదించాడు అంటే ఎలా సంపాదించాడు అనే ఆసక్తి ఉంటుంది. అందుకే ఈ సినిమాలో మిడిల్ క్లాస్ వ్యక్తి అయిన దుల్కర్ సల్మాన్ తో ప్రతి ఒక్కరు ట్రావెల్ చేయడంతో పాటు, అతడి పాత్రను బాగా లవ్ చేస్తారని త్రివిక్రమ్ అన్నారు.
విజయ్ దేవరకొండ అంటే నాకు చాలా అభిమానం. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అమితమైన ప్రేమ, అభిమానం, సక్సెస్ ను చూడటంతో పాటు విమర్శలు, ఫ్లాప్ లు చూశాడు. అంత తక్కువ సమయంలో అలా రెండింటిని చూడటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అందుకే విజయ్ చాలా గట్టోడు అనుకోవచ్చు. విజయ్ గట్టి వాడు కనుక తిరిగి పుంజుకుంటాడు. తప్పకుండా మంచి సినిమాలు ఆయన నుంచి వస్తాయని త్రివిక్రమ్ హామీ ఇచ్చారు. ఇక లక్కీ భాస్కర్ సినిమా షూటింగ్ సమయంలో నేను ఎప్పుడూ సెట్స్ కి వెళ్లలేదు. దుల్కర్ ను చాలా తక్కువ సార్లు కలవడం జరిగింది. సినిమాను సెట్స్ పై చూడటం కంటే థియేటర్ లో చూడాలని నేను కోరుకుంటాను. అందుకే షూటింగ్ సమయంలో ఎక్కువ సెట్స్ కి వెళ్లలేదని త్రివిక్రమ్ అన్నారు.