త్రివిక్రమ్ తో ఆ హీరో.. సెట్టవ్వడానికి 20 ఏళ్ళు పట్టిందా..?

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తెలుగు సినిమా పాఠశాలలో మాస్టర్‌గా నిలిచిపోయిన దర్శకుల్లో ఒకరు.;

Update: 2025-04-15 04:24 GMT
త్రివిక్రమ్ తో ఆ హీరో.. సెట్టవ్వడానికి 20 ఏళ్ళు పట్టిందా..?

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తెలుగు సినిమా పాఠశాలలో మాస్టర్‌గా నిలిచిపోయిన దర్శకుల్లో ఒకరు. తన డైలాగ్స్, ఎమోషన్, కామెడి తో గురూజీగా ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టిన సమయంలో, ఆయన కొత్త సినిమా ఏ హీరోతో ఉంటుందా అనే ప్రశ్న ఫ్యాన్స్‌ మధ్య చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్‌తో కొత్త సినిమా చేస్తాడన్న క్లారిటీ ఇదివరకే వచ్చినా, అతనితోపాటు మరో కాంబో సెటప్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఈ మధ్యే అల్లు అర్జున్‌ తన పుట్టినరోజు సందర్భంగా అట్లీతో సినిమా చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో చేసే సినిమా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ మరో ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. ఇక మరో ప్రాజెక్టు హీరో మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్.

వెంకటేశ్‌తో త్రివిక్రమ్ అనుబంధం కొత్తది కాదు. త్రివిక్రమ్ రచయితగా తన కెరీర్‌ను ప్రారంభించిన సమయంలో వెంకీ సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’కు స్క్రిప్ట్ వర్క్ చేశారు. అప్పటినుంచి త్రివిక్రమ్‌కు వెంకటేశ్‌తో దర్శకుడిగా సినిమా చేయాలనే కోరిక ఉండేదట. కానీ ఎన్నిసార్లు ప్లాన్ చేసినా, అది సెటవ్వలేదు. ఒక్కోసారి స్క్రిప్ట్ విషయంలో, ఇంకొకసారి డేట్స్ కలవక పక్కన పడిపోయింది.

ఇలా 20 ఏళ్లుగా త్రివిక్రమ్-వెంకీ కాంబో కలిసేందుకు ప్రయత్నాలు జరగడం, చివరికి ఇప్పుడే సెట్ కావడం నిజంగా ప్రత్యేకం. ఇదిలా ఉండగా, సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకటేశ్ మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి ఆయన సరైన కథ కోసం ఎదురుచూస్తున్నారు. మధ్యలో కొన్ని స్క్రిప్టులు వినినా ఏదీ వెంటనే చేయాలనిపించలేదట.

కానీ త్రివిక్రమ్ చెప్పిన కథ మాత్రం వెంటనే వెంకీకి నచ్చేసిందట. ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగుతుందని సమాచారం. వెంకటేశ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాత్రతో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. ఇక త్రివిక్రమ్ మాత్రం ఒకవైపు బన్నీ సినిమా స్క్రిప్ట్ పనుల్ని కొనసాగిస్తూనే, మరోవైపు వెంకీ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేయబోతున్నారట. ఈ సినిమా ముందు పూర్తి చేసి, ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా సెట్స్‌ మీదకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News