ఇక మన కథలే చెప్పాలి.. గురూజీ ఎప్పుడో చెప్పేశాడుగా..?
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం.. ఇంకా టెక్నికల్ డెవలప్ మెంట్ వల్ల ప్రపంచ సినిమా మన చేతుల్లోకి వచ్చేసింది
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం.. ఇంకా టెక్నికల్ డెవలప్ మెంట్ వల్ల ప్రపంచ సినిమా మన చేతుల్లోకి వచ్చేసింది. ఒకప్పుడు పక్క భాషలో సినిమా మన దగ్గర రీమేక్ చేస్తే కానీ తెలిసేది కాదు కానీ ఇప్పుడు పాన్ ఇండియా పాన్ వరల్డ్ అంటూ సినిమాలు సత్తా చాటుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా సినిమాలు సక్సెస్ లు అవుతున్నాయి. ఏదైనా సినిమాలో ఒక సీన్ వేరే సినిమాకు కాస్త పోలికగా ఉంటే చాలు కాపీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఓటీటీ కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులోకి రావడం వల్ల వరల్డ్ సినిమాను వారు చూస్తున్నారు. ఒకవేళ దర్శకులు ఎవరైనా ఎక్కడ నుంచైనా రిఫరెన్స్ తీసుకుంటే దాన్ని వెంటనే కనిపెట్టేస్తున్నారు. ఐతే ఈ విషయాన్ని త్రివిక్రం శ్రీనివాస్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమా టైం లోనే చెప్పాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది మనం ఏ కథ స్పూర్తిగా తీసుకున్నా కాపీ అనేస్తారు. దాదాపు ప్రపంచంలో ఉన్న కథలన్నీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయని అన్నారు.
అందుకే ఇక ఇప్పుడు మన కథలను మనం చెప్పాలని అన్నారు త్రివిక్రం శ్రీనివాస్. మన కథలు మన పురాణాలు మన సాంప్రదాయాలు.. ఇలా మన కథలను చెప్పడం మొదలు పెట్టాలని అప్పుడు అన్నారు. త్రివిక్రం అప్పుడు ఏదైతే చెప్పాడో ఇప్పుడు మన మేకర్స్ అదే చేస్తున్నారు. మన ఎమోషన్స్.. ఇతి హాసాల మీద మన నమ్మకం.. రామాయణ, మహాభారతాలను వెండితెర మీద ఆవిష్కరిస్తున్నారు. నేటి యువ ప్రేక్షకులకు చెప్పాల్సింది కూడా అదే. ఈమధ్య తెలుగు సినిమాల్లో ఇలాంటి కథలు బాగా వస్తున్నాయి. వాటిని ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు.
సో గురూజీ ఎప్పుడో చెప్పిన మాట ఇప్పుడు మన దర్శక నిర్మాతలు ఫాలో అవుతున్నారు. ఇదే టైం లో త్రివిక్రం నుంచి కూడా ఇలాంటి ఒక సినిమా ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఆయన ఇప్పటివరకు తీసిన సినిమాల్లో అత్త, మదర్ ఇలాంటి సెంటిమెంట్స్ మాత్రమే చూశాం త్రివిక్రం కు ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రేక్షకులకు కూడా పంచే ప్రయత్నం చేస్తే కచ్చితంగా ఆయన గురూజీ అన్న మాటకు న్యాయం చేసినట్టు అవుతుంది. రానాతో హిరణ్యకశ్యప సినిమా త్రివిక్రం పర్యవేక్షణలో వస్తుందని ప్రకటించారు. కానీ ఆ సినిమా గురించి తర్వాత ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. త్రివిక్రం నుంచి ఇలాంటి ఒక భారీ సినిమా రావాలని ఆడియన్స్ కూడా కోరుతున్నారు.