గామి దెబ్బకు ఓం రౌత్ పై మళ్ళీ చురకలు
తాజాగా మరోసారి ఆదిపురుష్ మూవీపై ట్విట్టర్ లో ట్రోలింగ్ నడుస్తోంది. విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో విద్యాధర్ అనే కొత్త దర్శకుడు గామి మూవీ చేశాడు.
డార్లింగ్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కి 2022లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా ఆదిపురుష్. ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అనేక విమర్శలకి గురైంది. డైరెక్టర్ ఓం రౌత్ రామాయణాన్ని కొత్తగా చెప్పే ప్రయత్నంలో ఒరిజినల్ కథని పూర్తిగా పక్కన పెట్టేసి తనదైన కల్పన జోడించడంతో హిందుత్వ వాదులు విమర్శలు చేశారు.
కథ పరంగా ఫెయిల్ అయిన ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పైన కూడా ప్రేక్షకులు పెదవి విరిచారు. 300 కోట్ల పెట్టుబడి పెట్టి తీసిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయని సినీ విశ్లేషకుల నుంచి ప్రేక్షకుల వరకు అందరూ తేల్చేశారు. కొన్ని సీక్వెన్స్ అయితే మరీ యానిమేషన్ లో చేసినట్లు ఉన్నాయి తప్ప ఒరిజినాలిటీ లేదని విమర్శలు చేశారు.
ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమాలు వస్తోన్న ప్రతిసారి ఆదిపురుష్ ని ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉండటం విశేషం. హనుమాన్ సినిమా రిలీజ్ సమయంలో ఇలాగే ట్రోలింగ్ చేశారు. ఆ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ తో ఆదిపురుష్ ని పోల్చి చూపిస్తూ విమర్శలు చేశారు.
తాజాగా మరోసారి ఆదిపురుష్ మూవీపై ట్విట్టర్ లో ట్రోలింగ్ నడుస్తోంది. విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో విద్యాధర్ అనే కొత్త దర్శకుడు గామి మూవీ చేశాడు. ఈ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మూవీని పూర్తిగా మంచు కొండలు, హిమాలయాల్లో తెరకెక్కించారు. మనిషి స్పర్శని తట్టుకోలేని అంతుచిక్కని వ్యాధితో ఉన్న హీరో అఘోరాగా ఎందుకు మారాడు. తన వ్యాధి నుంచి ఎలా విముక్తి పొందాడు అనేది కథాంశం.
అయితే ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అని నెటిజన్లు నుంచి ప్రశంసలు వస్తున్నాయి. పిక్చరైజేషన్, విజువల్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ పెర్ఫెక్ట్ గా చేశారు. దీంతో ట్రైలర్ తోనే గామి సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దీంతో నెటిజన్లు నుంచి ఈ చిత్రానికి ప్రశంసలు వస్తూ ఉండటంతో పాటు ఆదిపురుష్ పై విమర్శలు మొదలయ్యాయి. ఆదిపురుష్ కంటే తక్కువ బడ్జెట్ లో వచ్చిన గామి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ చాలా బెటర్ అంటూ కామెంట్స్ పెట్టి ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీంతో మరోసారి ఆదిపురుష్ తెరపైకి వచ్చింది.