ట్రక్ ఢీకొని 23ఏళ్ల నటుడు దుర్మరణం
అక్కడ ఆయన గాయాలతో మరణించారని అంబోలి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.
రోడ్ ప్రమాదాల్లో వర్ధమాన నటుల అకాలమరణం అభిమానులకు షాకింగ్ గా మారుతుంది. అలాంటి ఒక షాకింగ్ ఘటన ముంబైలోని జోగేశ్వరి రోడ్డులో జరిగింది. తన మోటార్‌బైక్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో టీవీ నటుడు అమన్ జైస్వాల్ (23) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 'ధార్తీపుత్ర నందిని' అనే టీవీ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించిన జైస్వాల్ కు టీవీ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రమాదం అనంతరం అతడిని కామా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన గాయాలతో మరణించారని అంబోలి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.
ట్రక్ డ్రైవర్‌పై అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల టీవీ నటుడు చివరి ఇన్‌స్టా పోస్ట్ హృదయాలను ద్రవింపజేస్తోంది. యాక్సిడెంట్ అనంతరం సహచరులు చాలా ప్రయత్నాలు చేసినా కానీ, తీవ్ర గాయాల కారణంగా అధిక రక్తస్రావం కావడంతో అతడు మరణించారు.
నటుడు అమన్ అకాల మరణం అభిమానులను, సహోద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద సంఘటన జరిగినప్పుడు అమన్ ఆడిషన్‌కు వెళ్తున్నాడని తెలుస్తోంది. ధార్తీపుత్ర నందిని రచయిత ధీరజ్ మిశ్రా స్వయంగా అమన్ ప్రమాదం గురించి ధృవీకరించారు. పరిశ్రమ ఒక ప్రతిభావంతుడిని కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ధర్తిపుత్ర నందినిలో అమన్ తో కలిసి నటించిన షాగున్ సింగ్ సహా అతని సహనటులు అతడి మరణం గురించి ఇంకా బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. అభిమానులు కూడా షాక్‌లో ఉన్నారు.
అమన్ చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అందరినీ కలచివేస్తోంది అతడి అభిమానులతో ఈ వీడియోలో అతడు సంభాషించాడు. 31 డిసెంబర్ 2024న అతడు తన కలలు, ఆకాంక్షల గురించి ఏకపాత్రాభినయంతో కూడిన వీడియోను షేర్ చేసాడు. ''కొత్త కలలు, అంతులేని అవకాశాలతో 2025లోకి అడుగుపెడుతున్నాను'' అని ట్యాగ్ ని జోడించాడు. కానీ జీవితం అనూహ్యమైనది... రాబోవు క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అని నిరూపణ అయింది.
అమన్ ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో జన్మించాడు. అతడు వినోద రంగంలో ఉన్నత కెరీర్‌ను గడపాలనే కలలు కన్నా కానీ, విషాదకర మలుపులో తనువు చాలించాడు. టెలివిజన్‌కు మారే ముందు అమన్ మోడల్‌గా తన కెరీర్‌ను కొనసాగించాడు.