విజయ్ రాజకీయ పార్టీకి స్టాలిన్ శుభాకాంక్షలు
ఉదయనిది మాట్లాడుతూ-"కొత్త పార్టీని ప్రారంభించినందుకు విజయ్ కి నా శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీని ప్రాంభించే హక్కు ఎవరికైనా ఉంటుంది.
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. సినీరాజకీయ వర్గాల నుంచి ఈ సందర్భంగా విజయ్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అధికార డిఎంకే ప్రభుత్వ మంత్రి, సినీహీరో ఉదయనిధి స్టాలిన్ దీనిపై స్పందిస్తూ విజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఉదయనిది మాట్లాడుతూ-"కొత్త పార్టీని ప్రారంభించినందుకు విజయ్ కి నా శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీని ప్రాంభించే హక్కు ఎవరికైనా ఉంటుంది. విజయ్ ను ప్రజల కోసం పని చేయనివ్వండి" అని వ్యాఖ్యానించాడు.
MGR, జయలలిత తన కంటే ముందు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగిన సినీతారలు. ఇప్పుడు 49 ఏళ్ల విజయ్ తన పార్టీ 'తమిళగ వెట్రి కజగం'(టివికే)ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఐక్యతకు ఆటంకం కలిగించే పరిపాలన క్షీణత, అవినీతి, విభజన రాజకీయాలతో నిండిన ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయమే ధ్యేయంగా బరిలో దిగినట్టు ప్రకటించారు. తమిళనాడు ప్రజలు మార్పు కోసం వేచి చూస్తున్నారని విజయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. "నా నాయకత్వంలో తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీ ప్రారంభించాను. దానిని నమోదు చేయడానికి భారత ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసాం" అని చెప్పారు. 2026లో అధికారంలో ఉన్న డిఎంకె ప్రభుత్వ పదవీకాలం ముగియగానే తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుందని, టివికె అధ్యక్షుడిగా ఉన్న విజయ్, రాబోయే లోక్‌సభలో ఎవరికీ మద్దతు ఇవ్వబోమని చెప్పారు.
అధికార డీఎంకే అలాగే ప్రతిపక్ష బీజేపీ రెండూ కూడా విజయ్‌కి తన కొత్త కెరీర్ విజయవంతం కావాలని తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేసాయి. దళపతి వీరాభిమానులు రాజకీయ పార్టీని ప్రారంభించాలనే అతడి ఆలోచనను, చర్యను స్వాగతించారు. వీధుల్లో అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దళపతి అంటే జనరల్ లేదా కమాండర్. అయితే 'తమిళగ వెట్రి కజగం' అంటే 'తమిళనాడు విక్టరీ పార్టీ' అని అర్థం వస్తుంది.
అవినీతి, కుల, మత భేదాలు లేని నిస్వార్థ, పారదర్శక, దూరదృష్టి, సమర్ధవంతమైన పరిపాలనకు మార్గం సుగమం చేసే రాజకీయ ఉద్యమం కోసం తమిళనాడు ప్రజలు తహతహలాడుతున్నారు. ప్రజా ఉద్యమం మాత్రమే రాజకీయ మార్పుకు నాంది పలుకుతుందని, ఇతర విషయాలతోపాటు తమిళనాడు హక్కులను కాపాడుతుందని ఆయన అన్నారు.
ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్, నేపథ్య గాయని శోభా చంద్రశేఖర్‌ల కుమారుడు విజయ్.. తన తల్లిదండ్రులే కాకుండా తనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన తమిళనాడు ప్రజలకు మనస్ఫూర్తిగా సహాయం చేయాలనేది తన చిరకాల కోరిక అన్నారు.
జనవరి 25న చెన్నైలో జరిగిన జనరల్ కౌన్సిల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడు సీనియర్ కార్యకర్తలను ఎన్నుకున్నారు. పార్టీ తాలూకా రాజ్యాంగం, చట్టాలను కూడా ఆమోదించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం ద్వారా ప్రజలు కోరుకునే రాజకీయ మార్పుకు బాటలు వేయడమే తమ ధ్యేయమని అన్నారు. ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందిన తర్వాత పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఈలోగా, పార్టీ కార్యకర్తలు సంఘటితమవుతారు. పార్టీ మౌళిక సదుపాయాలను బలోపేతం చేస్తారు. పార్టీ విధానాలు, జెండా, చిహ్నం ఇతర ప్రణాళికలు తరువాత ఖరారు చేస్తారు.