ప్రభాస్‌తో ఢీకొడుతున్న సందీప్ వంగా అభిమాని!
ఈ చిత్రం తన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోవడంతో ఉన్ని ముకందన్ కెరీర్ రేంజ్ అమాంతం మారిపోయింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో అనూహ్యంగా దూసుకొచ్చిన హీరో ఉన్ని ముకుందన్. 'మార్కో' చిత్రంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ చిత్రం తన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోవడంతో ఉన్ని ముకందన్ కెరీర్ రేంజ్ అమాంతం మారిపోయింది. ఇప్పుడు దేశంలోని పాన్ ఇండియన్ హీరోలలో ఒకడిగా మారిపోయాడు అతడు. 'ఫిల్మ్‌ఫేర్'తో తాజా ఇంటర్వ్యూలో ముకుందన్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ గురించి అతడు వెల్లడించాడు.
ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న పాన్ ఇండియన్ చిత్రం స్పిరిట్ లో అతడు అవకాశం అందుకున్నాడని కొంతకాలంగా కథనాలొస్తున్నాయి. ఇదే విషయమై ఫిలింఫేర్ అతడిని ప్రశ్నించగా, అవకాశం ఇచ్చినందుకు అతడు ధన్యవాదాలు తెలిపాడు.
ఉన్ని ముకందన్ మాట్లాడుతూ-''నేను సందీప్ సర్‌కి పెద్ద అభిమానిని.. ఆయనతో కలిసి పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు'' అని అన్నారు. పరిశ్రమలో మీకు అతిపెద్ద ప్రేరణ ఎవరు, వారు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేశారు? అని ప్రశ్నించగా, కష్టపడి పనిచేసే ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడు నాకు ప్రేరణ. వారి నైపుణ్యానికి నిజాయితీ ఉన్న ఎవరైనా నాకు ప్రేరణ అని ఉన్ని ముకుందన్ అన్నారు.
చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ఆరంభ రోజుల్లో మీరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? అని ప్రశ్నించగా, అతడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. కొత్తగా వచ్చిన వ్యక్తిగా, పోటీ పరిశ్రమలో నన్ను నేను స్థాపించుకోవడంలో మామూలుగా అందరూ ఎదుర్కొనే సవాళ్లను నేను కూడా ఎదుర్కొన్నాను. నటుడిగా నన్ను నేను నిరూపించుకోవడానికి, గుర్తింపు పొందడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే నా కెరీర్ ప్రారంభ రోజుల్లో నాకు మార్గనిర్దేశం చేసిన సహాయక కుటుంబం, మార్గదర్శకులు ఉండటం నా అదృష్టం.. అని ఉన్ని ముకుందన్ అన్నారు.