'అన్‌స్టాపబుల్‌ 4' రివ్యూ: ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందంటే?

'తిరిగొచ్చిన విజయం' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తెలుసుకుందాం.

Update: 2024-10-26 04:54 GMT

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ విత్ NBK’ టాక్‌ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకొని ఇప్పుడు నాలుగో సీజన్ లో అడుగుపెట్టింది. ‘అన్‌స్టాపబుల్‌ 4’ ఫస్ట్ ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఎపిసోడ్, ‘ఆహా’ ఓటీటీలో శుక్రవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. 'తిరిగొచ్చిన విజయం' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తెలుసుకుందాం.

బాలకృష్ణ సినిమాల్లోని పాటలు, డైలాగ్స్ మిక్స్ చేసి డిజైన్ చేసిన ఇంట్రడక్షన్ సాంగ్ తో ‘అన్‌స్టాపబుల్‌ 4’ ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ సీజన్ లో ప్రతీ ఎపిసోడ్ కు బాలయ్య తన సినిమాల్లోని గెటప్స్ తో వచ్చి, ఆ మూవీ సంగతులను పంచుకోబోతున్నారని తెలుస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ కు 'బొబ్బిలి సింహం' గెటప్ తో వచ్చారు బాలకృష్ణ. తన ఐడియాతోనే రచయితలు ఈ స్టోరీ రాసినట్లుగా చెబుతూ.. బొబ్బిలి సింహం సినిమా విశేషాలను పంచుకున్నారు. ఎంత డబ్బున్నా ఎంత చదువుకున్న, వాళ్ళ ఊరి కోసం వాళ్ళు ఫైట్ చేయాలనే స్ఫూర్తితోనే ఈ సినిమా తీసాం అని.. అదే స్పూర్తితో మూడోసారి హిందూపూర్ ఎమ్మెల్యే అయ్యాను అని చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనను గెలిపించిన ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు.

''ఇది కలికాలం బావ.. ద్వాపర యుగంలో బావమరిది భవద్గీత చెబితే బావ విన్నాడు. ఇక్కడ బావ చెబితే.. బావమరిది వింటున్నాడు'' అంటూ ప్రారంభంలోనే బాలయ్య నవ్వులు పూయించారు. బాలకృష్ణ రాసిన గీతాబోధన అంటూ ‘అన్‌ స్టాపబుల్‌’ పుస్తకంపై చంద్రబాబుతో సరదాగా ప్రమాణం చేయించడం ఆకట్టుకుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్స్ తో ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేసారు బాలయ్య. నంద్యాలలో అరెస్ట్ చేసిన రోజు విషయాలను సీబీఎన్ గుర్తు చేసుకున్నారు. ఆ రోజు జరిగిన సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నానని, తాను ఎప్పుడూ తప్పు చేయలేదు.. నిప్పులా బతికానని తెలిపారు. అరెస్ట్‌ చేస్తారనో, ప్రాణం పోతుందనో భయం పడితే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేం. ఆ ఆలోచనెప్పుడూ నా మదిలో ఎప్పుడూ ఉంటుందన్నారు చంద్రబాబు.

చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన ప్రశ్నలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ సమయంలో కుటుంబ సభ్యుల పరిస్థితి, వైఎస్ రాజశేఖర రెడ్డితో రాజకీయ వైరం, అప్పటి రాజకీయాలు, 53 రోజుల సీబీఎన్ జైలు జీవితం, గత ప్రభుత్వంపై విమర్శలు, పవన్ కళ్యాణ్ తో పొత్తు, కూటమి ఏర్పాటు, లోకేష్ యువగళం పాదయాత్ర.. వంటి అంశాల గురించి చర్చిస్తూ ఈ ఎపిసోడ్ ముందుకు సాగింది. తిరుమల లడ్డు వివాదంపై చంద్రబాబు స్పందించారు. దాని గురించి ఎక్కువగా మాట్లాడని చెబుతూనే.. ‘సిట్‌’ ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ దీక్షపై భిన్నాభిప్రాయాలు రావడంపై కూడా ముఖ్యమంత్రి స్పందించారు.

ఇటీవల బెజవాడ వరదలను ఎలా ఎదుర్కొన్నారనేది చంద్రబాబు వివరించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి P4 - పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌ విధానానికి శ్రీకారం చుట్టబోతున్నానని తెలిపారు. మధ్యలో 'బాలాగిరి' అంటూ చంద్రబాబుతో సరదాగా షాపింగ్ చేపించే ఓ ఆట ఆడించారు బాలయ్య. అలానే నారా దేవాన్ష్ అడిగిన కొన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. 'ఒక ఫ్యామిలీ, ఒక పారిశ్రామిక వేత్త' అనేది తన స్లోగన్ అని ఏపీ సీఎం చెప్పారు. చివరలో బాలయ్య, చంద్రబాబులను గజమాలతో సత్కరించడంతో ఈ ఎపిసోడ్ ముగిసింది.

ఓవరాల్ గా ‘అన్‌స్టాపబుల్‌ 4’ ఫస్ట్ ఎపిసోడ్ నందమూరి అభిమానులను, టీడీపీ కార్యకర్తలను ఆకట్టుకునేలా సాగిందని సోషల్ మీడియా పోస్టులు చూస్తే అర్థమవుతోంది. చంద్రబాబుతో బాలయ్య గతంలో చేసిన ఇంటర్వ్యూతో పోల్చి చూస్తే కొత్తగా ఏమీ అనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉండి మాట్లాడారు.. అంతే తేడా అని అంటున్నారు. బావ, బావమరుదులు ఒకరినొకరు పొగుడుకోడానికి, ఒకరి గురించి ఒకరు గొప్పలు చెప్పుకోడానికే ఈ ఇంటర్వ్యూ చేసినట్లు ఉందని న్యూట్రల్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు గురించి ఎవరికీ తెలియని విషయాల మీద పెద్దగా చర్చలు జరగలేదని.. మధ్య మధ్యలో సరదా ప్రశ్నలు అడిగినప్పటికీ, ఒక రెగ్యులర్ పొలిటికల్ ఇంటర్వ్యూ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు.


https://www.aha.video/webepisode/unstoppable-s04-ep1

Tags:    

Similar News