ఆ దాడి తీవ్రత గురించి తెలీదు ప్లీజ్: ఊర్వశి రౌతేలా
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి విషయమై స్పందిస్తూ, అదే వీడియోలో అసందర్భపు ప్రవర్తనతో ఊర్వశి రౌతేలా హెడ్ లైన్స్ లో కొచ్చిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి విషయమై స్పందిస్తూ, అదే వీడియోలో అసందర్భపు ప్రవర్తనతో ఊర్వశి రౌతేలా హెడ్ లైన్స్ లో కొచ్చిన సంగతి తెలిసిందే. సైఫ్ దాడి గురించి మాట్లాడిన ఊర్వశి వెంటనే టాపిక్ మార్చేసి డాకు మహారాజ్ సక్సెస్ గురించి మాట్లాడింది. అదే సమయంలో తనకు అందిన ఖరీదైన కానుకలను మీడియాకు చూపిస్తూ.. తానేదో సాధించేశాను అన్నట్టుగా మాట్లాడింది. అయితే తన అనుచిత ప్రవర్తనకు సైఫ్ కి ఊర్వశి రౌతేలా సారీ చెప్పింది.
సైఫ్ రగడపై మాట్లాడుతున్న వీడియోలో ఊర్వశి వజ్రాలతో నిండిన రోలెక్స్ మినీ వాచ్ ని, ఇతర ఆభరణాలను ప్రదర్శించింది. ఈ ప్రవర్తన చాలామందికి నచ్చలేదు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని, సైఫ్ కు ప్రత్యేకంగా ఇన్‌స్టాలో క్షమాపణలు చెప్పింది. కానీ తరువాత ఆ పోస్ట్‌ను తొలగించింది. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి గురించి పూర్తి వివరాలు తనకు తెలియవని... తెలిశాక చాలా ఆశ్చర్యపోయానని ఊర్వశి తెలిపింది.
ఉదయం 4 గంటలకు దాడి జరిగింది. అదే రోజు ఉదయం 8 గం.లకు ఇంటర్వ్యూలో ఉన్నాను. ఆ ప్రశ్న అడిగే సమయానికి నాకు ఏదీ తెలీదు. నేను మరింత జాగ్రత్తగా సమాధానం చెప్పి ఉండాల్సిందని అంగీకరిస్తున్నాను. నేను నిదుర లేవగానే ఎవరో నాకు చెప్పారు. అతడికి గాయాలయ్యాయని తెలుసు కానీ, ఎలా గాయపడ్డాడో నాకు తెలియదు.. ఘటన తీవ్రత నాకు తెలియదు! అని చెప్పింది. నేను సక్సెస్ వల్ల ఉద్వేగంగా ఉన్నాను. దానిని మించి అమ్మా నాన్న ఇచ్చిన కానుకలు మరింత ఉద్విగ్నంగా మార్చాయి. అంతేకానీ.. షో ఆఫ్ కోసం నేను అలా మినీ వాచ్ ని చూపించను కదా! అని ఊర్వశి అంది.
సైఫ్ ముంబై నివాసంపై దాడిని ఖండించిన ఊర్వశి `ఇది చాలా దురదృష్టకరం` అని వ్యాఖ్యానించింది. వెంటనే టాపిక్ మార్చేసి `డాకు మహారాజ్` బాక్సాఫీస్ వసూళ్ల గురించి మాట్లాడింది. మా అమ్మ వజ్రాలు పొదిగిన రోలెక్స్‌ను బహుమతిగా ఇచ్చింది. నా తండ్రి నా వేలికి ఈ మినీ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు.. ఆనందం పట్టలేకపోయాను అని తెలిపింది.
జనవరి 16న బాంద్రాలో ఒక దుండగుడు సైఫ్ అలీ ఖాన్‌ను కత్తితో పొడిచాడు. వెన్నెముక దగ్గర, మెడ మీద సైఫ్ కి గాయాలు అయ్యాయి. లీలావతి ఆసుపత్రికి తరలించగా, అతడికి శస్త్రచికిత్సలు జరిగాయి. సైఫ్ ప్రస్తుతం ఇంటి వద్దనే ఉన్నాడు.