ఊర్వశి స్వయం మర్ధనం దేనికోసం?
చక్కనమ్మ చేసింది ఒక్క ఐటమ్ నంబరే కానీ, డాకు మహారాజ్ కి అన్నీ నేనే! అన్న చందంగా మాట్లాడింది.
కొందరికి సొంత డబ్బా (స్వయం మర్దనం) కొట్టుకోనిదే నిదురే పట్టదు. ఫలానా హిట్టులో నేను భాగం అని చెప్పుకోవడానికి కూడా సొంత డబ్బా అవసరమా? కానీ ఇక్కడ వ్యవహారం చూస్తుంటే, అవును.. నేను కూడా ఈ బ్లాక్ బస్టర్ లో ఉన్నాను అని గుర్తు చేసేందుకు ఊర్వశి రౌతేలా ఎలా తాపత్రాయపడుతోందో చూశారా?
చక్కనమ్మ చేసింది ఒక్క ఐటమ్ నంబరే కానీ, డాకు మహారాజ్ కి అన్నీ నేనే! అన్న చందంగా మాట్లాడింది. అంతేకాదు.. అసందర్భంగా సైఫ్ ఖాన్ పై కత్తి దాడి గురించి ఏఎన్.ఐ ప్రతినిధి ప్రశ్నిస్తుంటే, ఊర్వశి దాని గురించి సమాధానం క్లుప్తంగా ఒక లైన్ తోనే దాటవేసి.. డాకు మహారాజ్ హిట్టయిందని చెబుతూ.. తనకు మమ్మీ డాడీ ఇచ్చిన ఖరీదైన కానుకలను మీడియా ప్రతినిధికి చూపిస్తోంది.
నిజానికి ఇది అసందర్భ ప్రవర్తనలా అనిపిస్తుంది. అసలు సైఫ్ పై దాడి ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండానే తన సక్సెస్ గురించి గొప్పలు పోతూ.. తనకు మమ్మీ డాడీ గిఫ్టులిచ్చారని, అది కూడా డాకు మహారాజ్ సక్సెస్ ఇచ్చిన మజా అంటూ ఊర్వశి పేర్కొంది. ఈ వ్యవహారమంతా వీక్షిస్తున్న ఆడియెన్ మాత్రం ఊర్వశికి నిజంగానే మతిపోయిందా? రాక రాక చాలా కాలానికి సక్సెస్ రావడంతో ఇలా దీనిని ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని తాపత్రాయపడుతోందా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి విడుదలైన నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతం దబిడి దిబిడి మాస్ కి మంచి ఊపు తెచ్చింది. ఊర్వశి గతంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యలోను ప్రత్యేక గీతంలో నర్తించిన సంగతి తెలిసిందే.
సిగ్గుపడుతున్నాను:
అయితే సైఫ్ అలీఖాన్ పై దాడి గురించి రిపోర్టర్ ప్రశ్నించగా, సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఊర్వశి.. తనకు అందిన డైమండ్ రింగ్ బహుమతిని, ఖరీదైన వాచ్ ని చూపిస్తూ మీడియా ఇంటర్వ్యూలో బోల్డ్ గా మాట్లాడింది. అయితే దీనిపై నెటిజనుల నుంచి చాలా విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి ఊర్వశి మరో పోస్ట్ లో స్పందిస్తూ.. అలా జరిగినందుకు సిగ్గుపడుతున్నానని, తన తప్పిదాన్ని క్షమించాలని సైఫ్ ని కోరింది. ఈ ఇంటర్వ్యూ సమయానికి సైఫ్ పరిస్థితిలో సీరియస్ పరిణామం గురించి తనకు తెలియదని, తాను డాకు మహారాజ్ సక్సెస్ ప్రచారంలో ఉన్నానని తెలిపింది.