ఏజెంట్ కథ రాసిన రైటర్ ఏమన్నారంటే?
కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం దొరకలేదు. అఖిల్ కి ఏజెంట్ తో కెరియర్ లోనే కోలుకోలేని దెబ్బ పడింది
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. అఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాతకి భారీ నష్టాలను మిగిల్చడమే కాకుండా డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రైటర్ వక్కంతం వంశీ పై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఏజెంట్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు.
కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం దొరకలేదు. అఖిల్ కి ఏజెంట్ తో కెరియర్ లోనే కోలుకోలేని దెబ్బ పడింది. ఆ రేంజ్ లో ఏజెంట్ డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీకి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథ అందించారు. కిక్, రేసుగుర్రం, టెంపర్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఏజెంట్ కథ రాశారంటే చాలామంది ఇది నమ్మలేకపోయారు.
అయితే తాజాగా ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు వక్కంతం వంశీ. ఈయన దర్శకత్వంలో నితిన్ హీరోగా 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. డిసెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వక్కంతం వంశీకి ఏజెంట్ గురించిన ప్రశ్న ఎదురయ్యింది. రీసెంట్ గా ఏజెంట్ మూవీకి మీరు రైటర్ గా వర్క్ చేశారు. తెరమీద చూసిన కథ మొత్తం మీదేనా? అని అడిగిన ప్రశ్నకు..
వక్కంతం వంశీ బదులిస్తూ.." నేను ఇంకా సినిమా చూడలేదు. సినిమాలో ఏముందో నాకు ఇప్పటివరకు తెలియదు. సినిమా రిలీజ్ అయినప్పుడు నేను షూటింగ్ లో ఉన్నా. టీజర్, ట్రైలర్ తప్ప ఇప్పటివరకు సినిమా చూడలేదు. ఓటీటీలో వస్తే చూద్దాం అనుకుంటే అది ఇంకా ఓటీటీలో రాలేదు. నా లైఫ్ లో నేను థియేటర్లో చూడని నా ఏకైక కథ అదే.
నేను స్వయంగా కథ రాసిన సినిమాను థియేటర్లో చూడలేకుండా అయిపోయానని ఇప్పటికీ సురేందర్ రెడ్డికి చెబుతూ జోకులు వేస్తుంటా" అంటూ వక్కంతం వంశీ చెప్పుకొచ్చారు. దీంతో ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వక్కంతం వంశీ కామెంట్స్ పై పలువురు నెటిజన్స్ రియాక్ట్ అవుతూ వంశీ అబద్ధం చెబుతున్నారని, తాను తప్పించుకోవడానికే అలా అంటున్నారని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.