అట్లీ, సందీప్, గోపీచంద్ తర్వాత వంశీ..!
వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన యానిమల్ సినిమా సౌత్ దర్శకుల స్థాయిని అక్కడ మరింతగా పెంచింది.
సౌత్ దర్శకులకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంది. తమిళ దర్శకులు మురుగదాస్ ఇప్పటికే బాలీవుడ్‌లో పలు సినిమాలను చేసి మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక అట్లీ ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో జవాన్ సినిమా చేసి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. దాంతో అట్లీతో వర్క్ చేయడం కోసం మరికొందరు బాలీవుడ్ స్టార్ హీరోలు ఆసక్తిని కనబర్చుతున్నారు. ఇక రణబీర్ కపూర్‌తో బాలీవుడ్‌లో తెలుగు దర్శకుడు సందీప్ వంగ చేసిన యానిమల్ సినిమా సెన్షేషన్ క్రియేట్ చేసింది. వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన యానిమల్ సినిమా సౌత్ దర్శకుల స్థాయిని అక్కడ మరింతగా పెంచింది.
ప్రస్తుతం తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక హిందీ సినిమాను తీస్తున్నాడు. ఆ సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకే తెలుగు దర్శకులు అంటే ఆసక్తిని కనబర్చుతూ బాలీవుడ్ స్టార్స్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సౌత్ దర్శకులు బాలీవుడ్‌లో సత్తా చాటగా త్వరలోనే దర్శకుడు వంశీ పైడిపల్లి సైతం బాలీవుడ్‌లో సినిమాకు రెడీ అవుతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఆమీర్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి సినిమా ఒకటి ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వంశీ చెప్పిన కథకు ఆమీర్ ఖాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో 2025లో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.
ఆమీర్ ఖాన్ చాలా ఏళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి సమయంలో తెలుగు దర్శకుడు వెళ్లి కథ చెప్పడం, గత కొన్నాళ్లుగా సౌత్ దర్శకులు నార్త్‌లో ప్రభంజనం సృష్టిస్తున్న కారణంగా ఆమీర్‌ఖాన్ నో చెప్పలేక పోయాడు. అందుకే ఇప్పటికే వీరి కాంబో మూవీ ఫైనల్ అయ్యింది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే అమీర్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబో మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కంటే ముందే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. 2026లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయని తెలుస్తోంది.
ఇండస్ట్రీలో వంశీ పైడిపల్లి అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. కానీ ఆయన మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తూ ఉంటాడు. స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ దర్శకుడు అయినా చాలా తక్కువ సినిమాలు చేసి తన స్థాయిని కాపాడుకుంటూ వచ్చాడు. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో సినిమాను రూపొందించిన వంశీ పైడిపల్లికి తెలుగులో ఆఫర్‌లు వచ్చినా ఆమీర్ ఖాన్‌ను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో గత ఏడాది కాలంగా వర్క్ చేస్తున్నాడు. ఎట్టకేలకు సినిమా కన్ఫర్మ్ అయ్యిందని, త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు వంశీ రెడీ అవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.