ఓజీ డైరెక్టర్‌తో మట్కా వాసు..!
తాజాగా ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లపై స్పందించాడు.
మెగా హీరో వరుణ్ తేజ్ నేడు 'మట్కా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మట్కా వాసు పాత్రతో వరుణ్ తేజ్ కచ్చితంగా మెప్పించబోతున్నట్లుగా మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ రెండు మూడు వారాల పాటు వరుసగా మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు అంటూ వరుణ్ తేజ్ బిజీగా ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లపై స్పందించాడు. కథలు వింటూనే ఉన్నానని, మంచి కథ తనవద్దకు వస్తే తప్పకుండా వెంటనే ఓకే చెప్తాను అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఓజీ సినిమాను చేస్తున్న సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా వరుణ్ తేజ్ తెలియజేశాడు. ఇప్పటికే సుజీత్ తనకు కథ చెప్పాడని, ఆ కథ పై వర్క్ జరుగుతుంది, మరోసారి కథ పై చర్చలు జరపాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుజీత్ ఓజీ సినిమాను చేస్తున్న పనిలో ఉన్నాడు. కనుక వరుణ్ తేజ్ సినిమా వెంటనే ప్రారంభం అయ్యే అవకాశాలు లేవు. ఓజీ సినిమా తర్వాత నానితో ఒక సినిమాను సుజీత్ చేయాల్సి ఉంది. ఓజీ కంటే ముందే నాని, సుజీత్‌ల కాంబో మూవీ రూపొందాల్సి ఉన్నా పవన్ తో మూవీ అనే ఉద్దేశ్యంతో ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుజీత్ తో సినిమా ఉందని, దాన్ని ఓజీ వల్ల ఆలస్యం చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇంకో రెండు మూడు వారాల షెడ్యూల్ మాత్రమే ఉందని, పవన్ కి వీలు ఉన్నప్పుడు ఓజీ కోసం డేట్లు ఇస్తే వాటిని సైతం పూర్తి చేసి వచ్చే సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నాడు. అది ఎంత వరకు వర్కౌట్ అయ్యేను చూడాలి. సుజీత్ ఓజీ సినిమా విడుదల అయ్యే వరకు మరే సినిమాను కమిట్ అయ్యే పరిస్థితి లేదు. త్వరలోనే ఓజీని ఆయన పూర్తి చేయాలని అందుకే పట్టుదలతో ఉన్నాడట.
వరుణ్ తేజ్ మట్కా సినిమాను కరుణ కుమార్ దర్శకత్వంలో చేయడం జరిగింది. మట్కాకి మంచి స్పందన వస్తే తప్పకుండా మరో పార్ట్ ఉంటుందని అన్నాడు. అది సీక్వెల్ కాకున్నా మరో విధంగా అయినా ఉంటుంది అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించడం జరిగింది. వింటేజ్ లుక్ లో వరుణ్ తేజ్ తన పెద్దనాన్న చిరంజీవిని గుర్తు చేశాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో వసూళ్లు ఎలా ఉంటాయి అనేది మరి కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.