మెగా ప్రిన్స్ కొరియన్ కనకరాజు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని బ్యాడ్ టైమ్ వెంటాడుతోంది. కొంత కాలంగా సరైన సక్సెస్ పడటం లేదు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని బ్యాడ్ టైమ్ వెంటాడుతోంది. కొంత కాలంగా సరైన సక్సెస్ పడటం లేదు. ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం `మట్కా` ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సినిమాపై వరుణ్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు గానీ పనవ్వలేదు. ఫలితం తివ్ర నిరాశనే మిగిల్చింది. అయినా రెట్టించిన ఉత్సాహంతో రేసులోకి దూసుకొస్తున్నాడు. కొత్త సినిమాల కమిట్ మెంట్ జోరు ఏం తగ్గలేదు.
మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. యూవీ క్రియేషన్స్-ఫస్ట్ ప్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని చిత్ర వర్గాలు తెలిపారు. అలాగే ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని సమాచారం. ఈ చిత్రానికి `కొరియన్ కనకరాజు` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.
హాస్యం, హారర్ అంశాలతో ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు సమాచారం. కామెడీ బ్యాక్ డ్రాప్ సినిమాలు గాంధీ తెలివిగా డీల్ చేయగలడు. ఓవైపు హీరో పాత్రను హైలైట్ చేస్తూనే చక్కని హాస్యాన్ని పండిచగల దర్శకుడు. అయితే ఈసారి హాస్యంతో పాటు హారర్ ని టచ్ చేస్తున్నాడు. ఇంతవరకూ హారర్ జోనర్ లో గాంధీ సినిమాలు చేయలేదు. ఆ రకంగా వరుణ్ తో కొత్త అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఇందులో వరుణ్ తేజ్ పాత్ర రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా ఉంటుందిట.
అలాగే లుక్ పరంగా వరుణ్ కొత్తగా కనిపిస్తాడని సమాచారం. ఇక వరుణ్ తేజ్ ప్రయోగాలు చేయడంలో ఏమాత్రం వెనుకాడడు. ఇప్పటికే రకరకాల ప్రయోగాలు చేసాడు. కొన్ని ప్రయోగాలు బెడిసి కొట్టినా? కొన్ని పాత్రలు మంచి పేరును తీసుకొచ్చాయి. తాజాగా హారర్ నేపథ్యాన్ని టచ్ చేస్తున్నాడు. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు.