ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ
నటీనటులను ఎవరినైనా విజయం, అపజయం ఊపిరాడకుండా అయోమయంలో పడేస్తాయి. ఫ్లాప్ పడితే నెక్ట్స్ మూవీతో అయినా హిట్ అందుకోవాలని జాగ్రత్త పడతారు.
నటీనటులను ఎవరినైనా విజయం, అపజయం ఊపిరాడకుండా అయోమయంలో పడేస్తాయి. ఫ్లాప్ పడితే నెక్ట్స్ మూవీతో అయినా హిట్ అందుకోవాలని జాగ్రత్త పడతారు. అదే హిట్ వస్తే ఆ హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేయడానికి మరింత జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు.
ఇప్పుడు విక్టరీ వెంకటేష్ సిట్యుయేషన్ కూడా ఇదే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆయన మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని వెంకీ కూడా ఊహించలేదు. ఈ మూవీ ముందు వరకు వెంకీ కెరీర్లో ఏ సినిమా రూ.50 కోట్లు దాటింది లేదు. అలాంటిది సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా రూ.300 కోట్లు క్రాస్ అవడంతో వెంకీ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి? ఎవరితో చేయాలనే విషయంపై ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
వాస్తవానికైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ముందు వెంకీ రెండు స్టోరీలకు ఓకే చెప్పాడు. అందులో సామజవరగమన రైటర్ చెప్పిన కథ ఒకటి కాగా, వెంకీ అట్లూరి చెప్పిన కథ మరోటి. ఈ రెండు సినిమాల కథలు వెంకీకి బాగా నచ్చడంతో ఓకే చెప్పాడు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకున్నారంతా. కానీ ఇప్పుడు వెంకీ ఆ రెండు సినిమాలనూ లైట్ తీసుకున్నాడని తెలుస్తోంది.
ఇవి కాకుండా వెంకీ కోసం సురేందర్ రెడ్డి కూడా ఓ స్టోరీ రెడీ చేస్తున్నాడట. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ ఉండనుందట. ఆ కథకు కూడా వెంకీ నో చెప్తున్నాడని సమాచారం. ప్రస్తుతం వెంకీ స్టార్ డమ్ ఉన్న డైరెక్టర్ల కోసం చూస్తున్నాడట. యాక్షన్ సినిమాలు కాకుండా ఎంటర్టైన్మెంట్స్ తీయాలని వెంకీ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది.
మామూలుగా వెంకీ ఏ సినిమా చేసినా ఆ కథల్ని ఆయన అన్న సురేష్ బాబు కూడా వింటూ సినిమాలో ఇన్వాల్వ్ అవుతుంటాడు. మధ్యలో ఓ రెండు మూడు సినిమాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోలేదు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పుడు మళ్లీ సురేష్ బాబు కూడా వెంకీ సినిమాల కథలను వింటున్నాడని తెలుస్తోంది. సంక్రాంతి సినిమాల సత్తాను సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుసుకున్న వెంకీ ఇకపై ఏ సంక్రాంతినీ మిస్ చేసుకోకుండా ప్రతీ సంక్రాంతికీ తన సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.