యాక్టర్‌గా ఫెయిల్.. డైరెక్టర్‌గా హిట్
సినిమా ఇండస్ట్రీలోకి ఏదో అవుదామని వచ్చి.. ఇంకోదే అయిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు.
సినిమా ఇండస్ట్రీలోకి ఏదో అవుదామని వచ్చి.. ఇంకోదే అయిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా యాక్టర్ అవ్వాలనుకుని డైరెక్టర్లు అయిన వాళ్లు కొందరు ఉన్నారు. అందులో యంగ్ అండ్ టాలెంటెడ్ గాయ్ వెంకీ అట్లూరి ఒకడు. అప్పుడెప్పుడో వచ్చిన ‘జ్ఞాపకం’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. ఆశించిన రీతిలో గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయాడు.
హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెంకీ అట్లూరి ‘స్నేహ గీతం’ అనే చిత్రంలో సైడ్ రోల్‌ను చేశాడు. కానీ, దీని తర్వాత అతడు మరోసారి వెండితెరపై కనిపించలేదు. దీనికి కారణం అతడు రైటర్‌గా, డైరెక్టర్‌గా మారడమే. ‘కేరింత’ అనే సినిమాకు సంభాషణలు ఇచ్చిన అతడు.. ‘తొలి ప్రేమ’తో హీరోగా మారాడు. అది హిట్ కావడంతో అప్పటి నుంచి వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూనే ఉన్నాడు. మిస్టర్ మజ్ను, రంగ్ దే అంతగా క్లిక్ కాలేదు. కానీ సార్ తో బిగ్ హిట్ కొట్టేశాడు.
వెంకీ అట్లూరి తాజాగా దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాను చేసిన విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌లపై దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అలా దీపావళి కానుకగా దీన్ని అక్టోబర్ 31వ తేదీన విడుదల చేయగా.. దీనికి పాజిటివ్ టాక్ కూడా సొంతం అయింది. అలాగే, పబ్లిక్ నుంచి మంచి స్పందన రావడంతో వసూళ్లు బాగా లభిస్తున్నాయి.
డబ్బు ప్రధానంగా సాగే కథాంశంతో రూపొందిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ టార్గెట్‌ను రీచ్ అయ్యే దిశగా వెళ్తోంది. దీంతో చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. దీనికి సినిమా బృందంతో పాటు దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి కూడా గెస్టులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ ఊహించని విషయాన్ని పంచుకున్నాడు.
‘లక్కీ భాస్కర్’ సక్సెస్ మీట్‌లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ... ‘నేను యాక్టర్‌గా ఉన్నప్పుడు అంటే 2008లో చంద్రశేఖర్ ఏలేటి గారి సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న హను రాఘవపూడి గారికి ఆడిషన్ ఇచ్చాను. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న నాగ్ అశ్విన్‌కు ఆడిషన్ ఇచ్చాను. అలాంటి నేను ఇప్పుడు వాళ్లతో సమానంగా ఈ స్టేజ్ మీద నిల్చున్నాను. ఇది చెప్పడానికి నేనెంతో గర్వపడుతున్నాను. అంతేకాదు, మేము ముగ్గురమూ దుల్కర్ సల్మాన్ గారితో సినిమాలు చేసి హిట్ కొట్టాము’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అతడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
అదే సమయంలో ఒకవేళ అప్పుడు వెంకీ అట్లూరి ఆడిషన్ నచ్చి ఉంటే ఇప్పుడు డైరెక్టర్‌గా కాకుండా హీరోగానే కంటిన్యూ అయ్యేవాడు అని చాలా మంది చెప్పుకుంటున్నారు. అలాగే, అసలు వెంకీ అట్లూరి ఏ సినిమాలకు ఆడిషన్ ఇచ్చాడు? ఎందుకు సెలెక్ట్ కాలేదు? అని కూడా పలు ప్రశ్నలు వస్తున్నాయి.