ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత!
వయోభారం సహా అనారోగ్యంతో కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసారు.
ప్రముఖ నటి, నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి (102) తుదిశ్వాస విడిచారు. వయోభారం సహా అనారోగ్యంతో కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసారు. ఈ విషయాన్ని కృష్ణవేణి కుమార్తె అనురాధ తెలిపారు. శ్రీమతి కృష్ణవేణి 1927 డిసెంబర్ 24న కృష్ణాజిల్లాలోని పంగిడిగూడంలో ఎర్రం శెట్టి లక్ష్మణరావు- నాగరాజమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచి నటనంటే ఆసక్తి.
నాటకాలతో ఆమె నట జీవితం ప్రారంభమైంది. ఆమె నటన చూసి దర్శకుడు సి. పుల్లయ్య బాలనటిగా 'సతీ అనసూయ' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అలా 1936 లో ఆమె బాల నటిగా తెరంగేట్రం చేసారు. తెలుగు, తమిళ భాషల్లో నటించారు. కృష్ణవేణి హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం 'కచ దేవయాని'(1938) లో విడుదలైంది. ఆ సినిమా మంచి విజయం సాధించించింది.
ఆ తర్వాత 'మళ్లి పెళ్లి', 'మహానంద', 'జీవన జ్యోతి', 'దక్షయజ్ఞం', 'భక్త ప్రహ్లాదుడు', 'భీష్ముడు', 'బ్రహ్మారధం', ' గొల్లభామ', 'మదలస', 'మనదేశం', 'ధర్మంగద', 'లక్ష్మమమ్మ', 'ఆహుతి', 'తిరుగుబాటు', 'పెరంటాలు' చిత్రాల్లో నటించారు. మనదేశం, లక్ష్మమమ్మ, ధాంతప్యం, గొల్లభామ, భక్త ప్రహ్లాద చిత్రాలను స్వయంగా నిర్మించారు.
హీరోయిన్ గా నటిస్తోన్న సమయంలోనే కృష్ణవేణి కి మీర్జాపురం రాజావారితో పరిచయం జరిగింది. ఆయన దర్శక-నిర్మాత కూడా. వీరి వివాహం 1940 లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయట సంస్థల్లో పనిచేయడం ఇష్టం లేక సొంత ప్రొడక్షన్ జయా పిక్చర్స్- శోభనాచల స్టూడియోస్ స్థాపించి అందులోనే నటించారు.