అన్ని పార్ట్ 2లు బాహుబలి, కేజీఎఫ్, పుష్ప కాలేవు!
తమిళ ప్రముఖ దర్శకుల్లో వెట్రిమారన్ ఒకరు. ఆయనను తెలుగులోనూ ఒక వర్గం ప్రేక్షకులు అభిమానిస్తారు.
తమిళ ప్రముఖ దర్శకుల్లో వెట్రిమారన్ ఒకరు. ఆయనను తెలుగులోనూ ఒక వర్గం ప్రేక్షకులు అభిమానిస్తారు. ఆయన సినిమాలు, ఆయన మార్క్ ఫిల్మ్ మేకింగ్‌ను ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. అందుకే ఆయన దర్శకత్వంలో వచ్చిన విడుదల పార్ట్ 2 సినిమాకి భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా విడుదల పార్ట్ 1 కి మంచి విజయం దక్కింది. చిన్న సినిమాగా సూరి ప్రధాన పాత్రలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సెకండ్ పార్ట్‌ను అంతకు మించి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో తన హద్దులు దాటి, తన మార్క్ వదిలేసి వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 ని రూపొందించారని తెలుస్తోంది.
విడుదల పార్ట్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో విడుదల పార్ట్ 2 ను పాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప 2, కేజీఎఫ్ 2 స్థాయిలో విడుదల చేయాలని, ఆ స్థాయిలో విజయాలను సొంతం చేసుకోవాలని దర్శకుడు వెట్రిమారన్ భావించాడు. కానీ పూర్తిగా కథ అడ్డం తిరిగింది. సినిమాలో మ్యాటర్ లేదు. లేనిపోని హైప్ క్రియేట్ చేయడం ద్వారా మొత్తానికి మోసం వచ్చింది అంటూ రివ్యూవర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విడుదల పార్ట్ 2 పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వెట్రిమారన్ మార్క్ మూవీ కాదు ఇది అంటూ డైరెక్ట్‌గా ఎటాక్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
తమిళనాడులో మొదటి రెండు మూడు రోజులు కాస్త పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు నమోదు అయ్యాయి. కానీ ఇప్పుడు అక్కడ సైతం పెద్దగా వసూళ్లు రావడం లేదు. ఆ సినిమా ఈ సినిమా అని కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆధరిస్తారు అంటూ మరోసారి ఈ సినిమా ఫలితం నిరూపితం చేసింది. ప్రతి ఒక్కరూ బాహుబలి 2, పుష్ప 2, కేజీఎఫ్ 2 ల మాదిరిగా రెండో పార్ట్‌లను తీసుకు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకోవాలి అంటే కష్టమే. ఆ విషయాన్ని ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
విడుదల పార్ట్ 2 లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించగా, మంజు వారియర్ ఆయనకు జోడీగా నటించింది. మొదటి పార్ట్ లో విజయ్ సేతుపతి పాత్ర చాలా తక్కువగా ఉంది. సూరి ప్రధానంగా కనిపిస్తాడు. కానీ ఈ సినిమాలో మాత్రం విజయ్ సేతుపతి రోల్‌ను పెంచడం కోసం కథను పూర్తిగా మార్చేశారు. అందుకే సినిమా ఫలితం తారు మారు అయ్యింది. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం, కమర్షియల్ హిట్ కోసం దర్శకుడు వెట్రిమారన్ చేసినది చాలా పెద్ద తప్పు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. వెట్రిమారన్ తన లైన్ దాటారు అని అందుకే సినిమా ఫలితం తారుమారు అయ్యింది అంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ ఫలితంపై ఆయన స్పందన ఎలా ఉంటుందో చూడాలి.