సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న స్టార్ హీరో మూవీ!
గత కొన్ని వారాలుగా అజిత్ ఫ్యాన్స్ పొంగల్‌కి రాబోతున్న విడాముయార్చి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్', వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలతో పాటు తమిళ్‌లో స్టార్ హీరో అజిత్ మూవీ సైతం సంక్రాంతి రేసులో ఉందంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. ముందుగా మైత్రి మూవీ మేకర్స్ వారు అజిత్ హీరోగా నిర్మిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల రెండు నెలల క్రితమే సినిమాను సంక్రాంతికి విడుదల చేయలేమని మైత్రి వారు క్లారిటీ ఇచ్చారు. తమ సినిమాను సమ్మర్ 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే.
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను వాయిదా వేయడంతో అజిత్ నటిస్తున్న మరో సినిమా 'విడాముయార్చి'ని సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించిన విషయం తెల్సిందే. గత కొన్ని వారాలుగా అజిత్ ఫ్యాన్స్ పొంగల్‌కి రాబోతున్న విడాముయార్చి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా లైకా ప్రొడక్షన్స్ వారు సినిమాను సంక్రాంతికి విడుదల చేయలేక పోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. లైకా ప్రొడక్షన్ వారు కొన్ని కారణాల వల్ల అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆ కొన్ని కారణాలు ఏంటి అనే విషయంలో తమిళ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక కారణాల వల్లే సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో లైకా ప్రొడక్షన్స్‌లో రూపొందుతున్న ప్రతి సినిమా ఏదో ఒక విధంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అలాగే ఈ సినిమాను సైతం ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టాయని, అందుకే సినిమాను ఇప్పుడే విడుదల చేసే పరిస్థితి లేదు అంటున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం పొంగల్ నుంచి తప్పుకున్నా జనవరిలోనే చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తామని చెబుతున్నారు. అజిత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా ద్వారా లైకా ప్రొడక్షన్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సినిమాను సరైన విడుదల చేసే సత్తా లేనప్పుడు ఎందుకు నిర్మాణం చేయడం అంటూ కొందరు లైకా ప్రొడక్షన్స్‌ను డైరెక్ట్‌గా ఎటాక్ చేస్తున్నారు.
ప్రతి ఏడాది తమిళ్ సినిమాలు సంక్రాంతికి విడుదల కావడం వల్ల తెలుగు సంక్రాంతి సినిమాల విషయంలో కాస్త గందరగోళం క్రియేట్ అయ్యేది. ఈసారి తమిళ్ నుంచి పెద్ద సినిమాలు తెలుగులో సంక్రాంతికి విడుదల అయ్యేది లేదు. కనుక మన తెలుగు సినిమాలు మూడు మాత్రమే సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. మూడు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. ముఖ్యంగా వెంకటేష్‌తో అనిల్ రావిపూడి రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్‌లో ఏ స్థాయిలో దూసుకు పోతుందో చూస్తూనే ఉన్నాం. ఇక బాలకృష్ణ హ్యాట్రిక్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో వందల కోట్లను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.