ట్రోల్స్‌పై నయనతార భర్త స్పందన ఇదే!
అబద్ధం చెప్తున్నాడని ట్రోల్ చేయడంపై తాజాగా విఘ్నేష్ స్పందించారు.
ఇటీవల కాలంలో నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ దంపతులు వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. వీరికి సంబంధించిన ఏదొక విషయం మీద సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేయడం.. దాని గురించి ఇద్దరూ వివరణ ఇచ్చుకోవడం కామన్ గా జరుగుతోంది. ఈ మధ్య డైరెక్టర్స్ రౌండ్ టేబుల్ సెషన్‌లో అజిత్ కుమార్‌తో తన ఇంటరాక్షన్ గురించి విఘ్నేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా తాను డైరెక్టర్ చేసిన 'నానుమ్ రౌడీ దాన్' సినిమాని అజిత్ మెచ్చుకున్నారని చెప్పడంపై నెట్టింట ట్రోలింగ్ జరిగింది. అబద్ధం చెప్తున్నాడని ట్రోల్ చేయడంపై తాజాగా విఘ్నేష్ స్పందించారు.
రీసెంట్ గా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, సినిమాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల మీద చర్చించారు. ఈ రౌండ్ టేబుల్ సెషన్‌లో దర్శకుడు విఘ్నేష్ శివన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజిత్ కుమార్ తో తనకు ఉన్న పరిచయం గురించి మాట్లాడారు. 'ఎన్నై అరిందాల్' (తెలుగులో 'ఎంతవాడు గాని') సినిమాలో తానొక పాట రాశానని చెప్పారు. అలానే 'నానుమ్ రౌడీ దాన్' సినిమా అజిత్ తనకి నచ్చిందని చెప్పారని తెలిపారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'ఎన్నై అరిందాల్' చిత్రం 2015 ఫిబ్రవరిలో విడుదలైతే, 'నానుమ్ రౌడీ దాన్' అదే ఏడాది అక్టోబర్‌లో రిలీజయ్యింది. అలాంటప్పుడు అజిత్ టైం ట్రావెల్ చేసి మీ సినిమా చూశాడా? అని తెగ ట్రోల్ చేసారు. దీనిపై విఘ్నేష్ ఇంస్టాగ్రామ్ వేదికగా తాజాగా క్లారిటీ ఇచ్చారు.
“హాయ్ గైస్.. 'విశ్వాసం' షూటింగ్‌లో అజిత్ కుమార్ సర్‌ని కలిశాను. 'యెన్నై అరిందాల్' నుంచే నాకు అజిత్ సార్ తెలుసు, ఎందుకంటే డైరెక్టర్ గౌతమ్ మీనన్ సార్ నాకు ఆ సినిమాలో పాట రాసే అవకాశం ఇచ్చారు. కాబట్టి నాకు అక్కడే పరిచయం అయ్యారు. 'నానుమ్ రౌడీ ధాన్' సినిమా వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీలో 'విశ్వాసం' షూటింగ్ సమయంలో మళ్లీ సార్‌ని కలిసే అవకాశం వచ్చింది. ఇది నిజం. నేను రౌండ్‌టేబుల్‌లో అంతమంది పెద్ద దర్శకులతో కలిసి కూర్చున్నందున నేను దాని గురించి వివరంగా చెప్పలేకపోయాను. దయచేసి దీన్ని ఎగతాళి చేయడం మానేయండి” అని విఘ్నేష్ శివన్ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు.
ఇదిలా ఉంటే అజిత్ కుమార్ తో ఓ సినిమా చేయడానికి విఘ్నేష్ శివన్ చాలాకాలంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. అజిత్ 62వ చిత్రాన్ని విఘ్నేష్ డైరెక్ట్ చేయాల్సింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'AK 62' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. నయనతార హీరోయిన్ గా నటిస్తారని అనుకున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ అని ధృవీకరించారు. అయితే ఆరు నెలల ప్రొడక్షన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. విఘ్నేష్ డెవలప్ చేసిన ఫైనల్ స్క్రిప్ట్ అజిత్ కు నచ్చకపోవడమే దానికి కారణమని వార్తలు వచ్చాయి. అది జరిగిన కొన్నాళ్ళకు మగిజ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ 62వ సినిమాగా 'విదాముయార్చి' సెట్స్ మీదకు వెళ్ళింది.
ఇకపోతే విఘ్నేష్ శివన్ - నయనతార ఈ మధ్య పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. నయనతార జీవితం మీద రూపొందించిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ ధాన్' బీటీఎస్ క్లిప్స్ ను అనుమతి లేకుండా ఉపయోగించడంపై నయన్ - విఘ్నేష్‌లకు హీరో ధనుష్ లీగల్ నోటీసు పంపించారు. ఇది కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్ గా నడించింది. అలానే విఘ్నేష్ రీసెంట్ గా పుదుచ్చేరి వెళ్లి సీఎం, మంత్రులతో భేటీ అవ్వడంతో ప్రభుత్వ ఆస్తిని కోలుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నారని ప్రచారం మొదలైంది. దీనిపై విఘ్నేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా తాను డైరెక్ట్ చేస్తున్న 'LIK - లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' షూటింగ్ పర్మిషన్ కోసమే వారిని కలిసినట్లుగా తెలిపారు.