దిల్ రాజుకి ట్విస్ట్ ఇచ్చిన దేవరకొండ?
లైగర్ డిజాస్టర్ అనంతరం విజయ్ దేవరకొండ కెరీర్ మళ్ళీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళుతున్నట్లు అనిపిస్తోంది.
లైగర్ డిజాస్టర్ అనంతరం విజయ్ దేవరకొండ కెరీర్ మళ్ళీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళుతున్నట్లు అనిపిస్తోంది. ఆ డిజాస్టర్ గాయాన్ని వీలైనంత త్వరగా మరచిపోయేలా సాలీడ్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇక ప్రాజెక్ట్‌లు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సెట్స్‌పైకి వెళ్తుండటంతో, విజయ్ తన లైన్అప్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా కోసం ప్రత్యేకమైన లుక్‌లో కనిపిస్తుండగా, చివరి షెడ్యూల్ వేగంగా పూర్తవుతోంది. కింగ్‌డమ్ సినిమా పూర్తయ్యాక, విజయ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడిక్ మూవీ కోసం విజయ్ ఇప్పటికే డేట్స్ సెట్ చేసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పనులు విజయ్ వచ్చిన అనంతరం మరింత వేగంతో సాగనున్నాయి. ఏప్రిల్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం.
అయితే విజయ్ దేవరకొండ దిల్ రాజు బ్యానర్‌లో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఫ్యామిలీ స్టార్ సమయంలోనే దిల్ రాజు నుంచి అడ్వాన్స్ తీసుకున్న విజయ్ తప్పకుండా మరో సినిమా చేద్దామని మాట ఇచ్చాడు. దీంతో దిల్ రాజు ప్రాజెక్ట్ కోసం రవి కిరణ్ కోలాను దర్శకుడిగా ఫిక్స్ చేశాడు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా విజయ్ రాజుగారికి ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందట. అందుకు కారణం, విజయ్ తాజాగా బాలీవుడ్ సినిమా ఒకటి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. 'కిల్' ఫేమ్ నిఖిల్ నాగేశ్ భట్ చెప్పిన కథ విజయ్‌ను బాగా ఆకట్టుకుంది. ఆ ప్రాజెక్ట్ కోసం విజయ్ ఓకే చెప్పాడట. ఈ బాలీవుడ్ సినిమా కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కనుంది. ఇది పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్‌గా, ముంబైలో ప్రధానంగా షూట్ చేయనున్నట్లు టాక్.
ఈ సినిమా పూర్తి చేసిన తర్వాతే విజయ్ రవి కిరణ్ కోలా ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా విజయ్ తన లైన్అప్‌లో కాంప్రమైజ్ కాకుండా గట్టిగా మార్పులు చేసుకున్నాడు. 'కింగ్‌డమ్', రాహుల్ సంకృత్యాన్ పీరియాడిక్ మూవీ, బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్, ఆ తర్వాత రవి కిరణ్ కోలా సినిమా.. ఇలా వరుసగా నాలుగు సినిమాలతో విజయ్ బిజీ కానున్నాడు. ఈ క్రమంలో విజయ్ తన కెరీర్‌ను కొత్త లెవెల్‌కి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నాడు. మరి ఈ లైనప్ తో రౌడి స్టార్ క్రేజ్ ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.