VD 12 : చివరి నిమిషం వరకు సస్పెన్స్ తప్పదా?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత రావడం లేదు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత రావడం లేదు. టైటిల్‌ను ఇంకా రివీల్ చేయని మేకర్స్ విడుదల విషయంలోనూ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది అని, మరో రెండు వారాల వర్కింగ్ డేస్‌తో షూటింగ్ పూర్తి కానుంది అంటూ ఇటీవల యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ హడావిడి ఏమీ కనిపించడం లేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాను 2025 సమ్మర్‌లో విడుదల చేయాలని నిర్మాత నాగవంశీ పట్టుదలతో ఉన్నాడు.
VD 12 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను గతంలోనే మార్చి 28, 2025న విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ తేదీని ప్రకటించారు. కానీ సినిమా విడుదల తేదీ విషయంలో ఊగిసలాట కనిపిస్తుంది. అదే సమయంలో మరో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక విడుదల తేదీ మార్చే అవకాశాలు లేకపోలేదు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాను మార్చి చివరి వారంలో విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నారు. అందుకు పవన్ కళ్యాణ్ సహకారం సైతం ఉంటుంది అంటూ యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
పవన్ మరో వారం పది రోజుల డేట్లు కేటాయిస్తే కచ్చితంగా హరి హర వీరమల్లు సినిమాను పూర్తి చేస్తామని దర్శకుడు జ్యోతి కృష్ణ అంటున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యింది. వచ్చే వారం లేదా ఆ తర్వాత వారంలో హరిహర వీరమల్లు నుంచి మొదటి పాట రాబోతుంది. సినిమా ప్రమోషన్ హడావిడి మొదలు పెట్టబోతున్నట్లుగా నిర్మాత ఏఎం రత్నం పేర్కొన్నారు. వీరమల్లు సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. దాంతో ఆర్థిక భారం చాలా పెరిగింది. కనుక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విడుదల వాయిదా వేయకూడదు అనే నిర్ణయానికి వచ్చాడు. కనుక వీరమల్లు సినిమా విడుదల ఉంటే VD 12 సినిమా విడుదల కావడం అసాధ్యం.
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న VD 12 సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తూ ఉండగా కీలక పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతుంది. ఆమె పాత్ర ఏంటి, శ్రీలీలకు ఆమెతో సంబంధం ఏంటి, అసలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వచ్చే సన్నివేశాలు ఏంటి అంటూ ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాక్సాఫీస్‌ను షేక్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది అనే నమ్మకంను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత నాగవంశీ వ్యక్తం చేశాడు. గౌతమ్ తిన్ననూరి మరోసారి ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ నేపథ్యంలో విజయ్ దేవరకొండుకు ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది.