ఏడాది తర్వాత రౌడీ స్టార్ మరోటి..!
ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో మూవీ పట్టాలెక్కబోతుంది. మొదటి షెడ్యూల్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు.
గత ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆ సినిమా నిరాశ పరచడం తో తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. గత ఏడాది కాలంగా ఆయన ఆ ఒక్క సినిమాతోనే బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా మరో సినిమా ప్రారంభం కాబోతుంది. గతంలో ట్యాక్సీవాలా సినిమాను రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసిన విషయం తెల్సిందే. అతడి దర్శకత్వంలోనే రౌడీ స్టార్ మరో సినిమా రూపొందబోతుంది.
టాక్సీవాలా అన్యూహ్య పరిణామాల నేపథ్యంలో విడుదల అయ్యింది. సినిమాకు మంచి పేరు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు లభించాయి. కానీ కమర్షియల్‌గా చిన్న అసంతృప్తి మిగిలింది. ఆ అసంతృప్తిని సైతం శ్యామ్ సింగరాయ్ సినిమాతో బ్రేక్ చేసిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో సినిమాకు రెడీ అవుతున్నాడు. గత ఆరు నెలలుగా ఈ సినిమా అదుగో ఇదుగో అంటూ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు విజయ్ దేవరకొండ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో షూటింగ్ ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యిందని సెట్స్ నిర్మాణం సైతం పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది.
ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో మూవీ పట్టాలెక్కబోతుంది. మొదటి షెడ్యూల్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. అక్కడ పాట కోసం ప్రత్యేకంగా సెట్టింగ్‌ని నిర్మించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో చేయబోతున్న మొదటి షెడ్యూల్‌లో పాటతో పాటు రెండు మూడు రోజుల పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుంది. ఆ తర్వాత ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. ఆ సన్నివేశం కోసం వారం నుంచి పది రోజుల పాటు విజయ్ దేవరకొండ వర్క్ చేయబోతున్నాడు. సినిమా 1850 టైమ్ జోన్‌లో ఉంటుంది కనుక ప్రతిదీ సెట్స్‌లోనే చేయాల్సి ఉంటుంది. అందుకే కాస్త ఎక్కువ బడ్జెట్ ఖర్చు అవుతుందని అంటున్నారు.
పైగా ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ వోస్లూ నటించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. కనుక సినిమా ఏ స్థాయిలో ఊహకు సైతం అందడం లేదు. రాహుల్ సినిమా సినిమాకు వైవిధ్యంను కనబర్చుతూ వస్తున్నాడు. ఆయన ఆత్మలు, పునర్‌జన్మ వంటి కాన్సెప్ట్‌తో మొదటి రెండు సినిమాలు తీశాడు. కనుక ఈ సినిమా ఎలా ఉంటుంది అనే ఆసక్తి ఉంది. సరిగ్గా చెప్పాలి అంటే ఈ సినిమా కథ 1854 నుంచి 1878 మధ్య కాలంలో సాగుతుందట. అంతే సినిమా కథ అత్యంత విభిన్నంగా ఉండబోతుంది. విజయ్ దేవరకొండ మొదటి సారి ఇలాంటి విభిన్నమైన జోనర్ సినిమా చేస్తున్నాడు. కనుక ఆయన ఫ్యాన్స్‌కి ఈ సినిమా కచ్చితంగా మంచి అనుభూతిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు అంటున్నారు. విడుదల విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది.