ఆ సీన్స్ చేసేటప్పుడు వణికిపోయా
గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లు మూట గట్టుకుంటున్న పూరీకి ఛాన్స్ ఎలా ఇచ్చారని విజయ్ సేతుపతిని అడుగుతున్నారు నెటిజన్లు. తాజాగా ఈ విషయమై సేతుపతి రెస్పాండ్ అయి మాట్లాడారు.;

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఉగాది రోజునే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. పూరీ డైరెక్షన్ లో పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మీ కౌర్, పూరీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆడియన్స్ నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అసలు ఫామ్ లోని లేని, గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లు మూట గట్టుకుంటున్న పూరీకి ఛాన్స్ ఎలా ఇచ్చారని విజయ్ సేతుపతిని అడుగుతున్నారు నెటిజన్లు. తాజాగా ఈ విషయమై సేతుపతి రెస్పాండ్ అయి మాట్లాడారు. పూరీ చెప్పిన కథ తనకు చాలా బాగా నచ్చిందని, డైరెక్టర్ల ట్రాక్ రికార్డు చూసి తాను సినిమాలను ఒప్పుకోనని, స్క్రిప్ట్ నచ్చితే సినిమా చేస్తానని సేతుపతి తెలిపారు.
పూరీ చెప్పిన కథ లాంటి సినిమాలు తానెప్పుడూ చేయలేదని, కొత్త వాటికి ప్రాధాన్యం ఇస్తూ, గతంలో చేసిన తరహా కథలు రిపీట్ కాకుండా చూసుకునే క్రమంలో పూరీ తనకు కథ చెప్పారని, ఆ కథ నచ్చే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, జూన్ నుంచి సినిమా షూటింగ్ మొదలుకానున్నట్టు చెప్పిన సేతుపతి, ఆ సినిమాలో టబు లాంటి గొప్ప నటితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఆనందంగా ఉందన్నారు.
ఇప్పటికే 50 సినిమాలు చేసిన సేతుపతి తాను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో మహారాజా ఎంతో స్పెషల్ అని, అందులోని క్యారెక్టర్ చాలా కష్టమైనదని అన్నారు. అందులో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించిన సీన్స్ చేసేటప్పుడు వణికిపోయాని, ఉప్పెన, సూపర్ డీలక్స్ సినిమాల్లోని క్యారెక్టర్లు కూడా కష్టమైనవేనని కానీ మహారాజా సినిమా స్పెషల్ అని దానికి కారణం రియల్ లైఫ్ లో తాను ఓ అమ్మాయికి తండ్రి కావడమేనని తెలిపారు.
స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమాలను చేయడమే తన బలమని చెప్తున్న సేతుపతి, ఆయన సినిమాల్లో ఎప్పుడూ వినోదంతో పాటూ సమాజానికి ఉపయోగపడే సందేశం ఉండాలని కోరుకుంటానని చెప్తున్నారు. ప్రస్తుతం మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ సినిమాలో నటిస్తున్న యాక్షన్ మూవీతో పాటూ సేతుపతి చేతిలో పూరీ సినిమా, మరో రెండు తమిళ సినిమాలున్నాయి.