విజయ్ 69 స్టోరీ రైటర్ కమల్ హాసన్!
వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
తలపతి విజయ్ 69వ చిత్రం హెచ్. వినోధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది అక్టోబర్ 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరోయిన్ గా పూజాహెగ్డే ని...విలన్ గా బాబి డియోల్ ని ఫైనల్ చేసారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
అయితే ఇప్పటివరకూ ఈ సినిమాకి కథ, దర్శకుడిగా హెచ్ . వినోధ్ పేరు మాత్రమే వినిపించింది. విజయ్ పొలిటికల్ జర్నీని దృష్టిలో పెట్టుకుని వినోధ్ ఈ కథని సిద్దం చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడీ కథలో విశ్వనటుడు కమల్ హాసన్ కూడా వేళ్లు పెట్టినట్లు సమాచారం. వినోద్ రాసిన కథకి కమల్ తుది మెరుగులు దిద్దారని అంటున్నారు. సమాజంపై కమల్ కున్న అవగాహన, రాజకీయంగా ఆయన సంపాదించిన అనుభవాన్ని ఈ కథలో రంగరించినట్లు వినిపిస్తుంది.
కమల్ హాసన్ కూడా తమిళనాడులో రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. అయితే కమల్ తన పార్టీని జనాల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ప్రజా సమస్యలపై ఆయన పోరాటం కేవలం మీడియా వరకే పరిమితమైంది తప్ప! నేరుగా ప్రజల్లోకి తిరిగి కమల్ రాజకీయం చేసింది లేదు. కానీ విజయ్ మాత్రం ప్రజల్లో తిరిగి పార్టీ బలోపేతానికి శ్రమిస్తున్నారు.
పలు సందర్బాల్లో అధికార పార్టీ తీరును సైతం ఎండగట్టే ప్రయత్నం చేసారు. కానీ కమల్ కి మాత్రం సమాజం విషయంలో చేయాల్సిన మార్పుల విషయంలో ఓ విజన్ ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ 69 స్టోరీలో కమల్ ఆశలు..ఆశయాల్ని జొప్పించినట్లు వినిపిస్తుంది. అయితే టైటిల్స్ కార్డులో కమల్ పేరు ఎక్కడా పడదని..కేవలం వినోద్ పేరుతోనే టైటిల్స్ అన్ని ఉంటాయని అంటున్నారు. అంటే కమల్ ఈ సినిమాకి హిడెన్ రైటర్ గా పనిచేస్తున్నట్లు లెక్క.