ఫ్యాన్స్ గోల తట్టుకోలేక ఆడియో ఫంక్షన్ ఆపేశారు!
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన లియో వచ్చే నెల 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన లియో వచ్చే నెల 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మన టాలీవుడ్ లో సినిమాల విడుదల ముందు ప్రీ రిలీజ్ వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే తమిళ్ సినీ ఇండస్ట్రీ లో ఇంకా ఆడియో ఫంక్షన్స్ లు నిర్వహిస్తున్నారు. లియో సినిమాకి కూడా సెప్టెంబర్ 30న చెన్నై లో ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
ఆడియో విడుదలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఫ్యాన్స్ భారీ ఎత్తున వస్తారని అంతా ఎదురు చూస్తున్న సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ నుండి అధికారికంగా మేము ఈ ఆడియో విడుదల కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాము అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. దాంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లియో సినిమాకు ఉన్న బజ్ నేపథ్యం లో విజయ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆడియో విడుదల కార్యక్రమంకు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా భారీ ఎత్తున ఫ్యాన్స్ వస్తే పాస్ లు జారీ చేయడం సాధ్యం కాదు. అంతే కాకుండా భద్రతా పరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక లియో సినిమా ఈవెంట్ ను నిర్వహించడం సాధ్యం కావడం లేదని వారు పేర్కొన్నారు.
నిర్మాతలు చెప్పిన కారణం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు అనుకుంటే అందుకు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాని మొత్తం సినిమా బజ్ నాశనం చేసే విధంగా ఆడియో విడుదల కార్యక్రమంను రద్దు చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరో వైపు లియో ఆడియో విడుదల కార్యక్రమం క్యాన్సల్ వెనుక రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా అన్నట్లుగా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో లియో ఆడియో విడుదల కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ విషయమై విజయ్ మౌనంగానే ఉన్నారు.
స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో సినిమాలో విజయ్ కి జోడీగా త్రిష హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించిన విషయం తెల్సిందే. వెయ్యి కోట్ల సినిమా అంటూ విజయ్ ఫ్యాన్స్ చాలా నమ్మకంతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.