విజయ్ పాలిటిక్స్.. తండ్రి అలా అన్నారేంటి?

అయితే విజయ్.. పలు విభేదాల కారణంగా తన తండ్రి, డైరెక్టర్ ఎస్.ఏ.చంద్రశేఖర్ కు దూరంగా ఉంటున్నారు

Update: 2024-05-31 08:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా ఆయనకు ఓ రేంజ్ లో అభిమానులు ఉన్నారు. అయితే ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించనున్నారు. అందులో ఒకటైన గోట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత మరో సినిమా చేసి పూర్తి స్థాయి పాలిటిక్స్ లో అడుగుపెట్టనున్నారు విజయ్.

అయితే విజయ్.. పలు విభేదాల కారణంగా తన తండ్రి, డైరెక్టర్ ఎస్.ఏ.చంద్రశేఖర్ కు దూరంగా ఉంటున్నారు. కానీ విజయ్ ను హీరో చేసింది ఆయనే. రాజకీయ నేతగా కూడా చేయాలనుకున్నారు. అందులో భాగంగానే విజయ్ పేరు మీద అభిమాన సంఘాలు ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. అంతవరకు బాగానే ఉన్నా.. విజయ్, చంద్రశేఖర్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. దీంతో దూరంగా ఉంటున్నారు.

తల్లి శోభ మాత్రం విజయ్‌‌ ను అప్పుడప్పుడు కలుస్తుంటారు. అయితే కొన్ని నెలల క్రితం చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో విజయ్ తండ్రికి ఆపరేషన్ జరిగింది. అప్పుడు తండ్రి అనారోగ్యానికి గురయ్యారని తెలియడంతో విజయ్ వెళ్లి పరామర్శించినట్లు తెలిసింది. ఆ సమయంలో ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ వీరు రీసెంట్ గా కలిసినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల విజయ్ తల్లిదండ్రులు కాంచీపురం పుణ్యక్షేత్రానికి వెళ్లారు.

కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు.. విజయ్ తల్లిదండ్రులను పలకరించారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నించారు. దీంతో తన కుమారుడు రాజకీయాల్లోకి రావడం సంతోషమేనని చంద్రశేఖర్ తెలిపారు. కానీ విజయ్ రాజకీయాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోనని చెప్పారు. అందుకు గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.

అయితే విజయ్ కు పాండిచ్చేరి శాసనసభ్యులు బుస్సీ ఆనంద్ రాజకీయ పరంగా అన్నీ తానై సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని అనౌన్స్ చేసిన విజయ్.. ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. ఇప్పుడు విజయ్ పార్టీని తమిళగ వెట్రిక్ కళగంగా పిలుస్తున్నారు. ఇక విజయ్ దళపతి భవిష్యత్తులో పొలిటికల్ గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News