ఆ తెలుగు హీరోలిద్దరు `తంగలాన్` లా మారాలి!
చియన్ విక్రమ్ నటించిన `తంగలాన్` ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
చియన్ విక్రమ్ నటించిన `తంగలాన్` ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వైవిథ్యమైన సినిమాలు చేస్తే తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీగా ప్రమోషన్ కూడా నిర్వహించారు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఈవెంట్ చేసారు.
కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలు సైతం విక్రమ్ ఇచ్చారు. రిలీజ్ తర్వాత కూడా విక్రమ్ ప్రధాన నగరాల న్నింటిని కవర్ చేస్తున్నాడు. స్కూళ్లు..కాలేజీలు..థియేటర్లు అంటూ తన సినిమాకి కావాల్సిన ప్రచార మంతా తానే స్వయంగా చేసుకుంటున్నాడు. ఇది కూడా సినిమాకి మరింత కలిసొచ్చింది వచ్చిన పాజిటివ్ టాక్ కి విక్రమ్ ఇలా రౌండ్లు వేయడం..జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం కలిసొస్తుంది.
సినిమా వసూళ్లు పెరగడానికి ఇదీ ఓ కారణమంటున్నారు. ఆ సంగతి పక్కనబెడితే ఈ సినిమాతో పాటే ఓ రెండు తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన పక్కా కమర్శియల్ చిత్రాలవి. ఇక రిలీజ్ తర్వాత ఆ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలు సాధించాయో కూడా తెలిసిందే. రిజల్ట్ సంగతి పక్కన బెడితే ఆ హీరోలిద్దరు ప్రచారం సరిగ్గా నిర్వహించలేదనే టాక్ వినిపిస్తుంది.
రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్, కొన్ని రికార్డెడ్ వీడియోలు మినహాయించి సినిమా గురించి వ్యక్తిగతంగా జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేయలేదంటున్నారు. ఓపెనింగ్స్ పరంగా ప్రభావం చూపడానికి ఇది ఓ కారణంగా ప్రచారం సాగుతుంది. అలాగే ఆ హీరోలిద్దరు పారితోషికం విషయంలో రూపాయి తగ్గరని, డబ్బింగ్ చెప్పే సమయానికి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ కూడా పూర్తిగా ఇస్తే తప్ప ముందుకు రారు అనే ఆరోపణ కూడా ఈ సందర్భంగా తెరపైకి వస్తోంది.