'పుష్ప 2' పై అక్కసు వెళ్లగక్కిన స్టార్ డైరెక్టర్!

విక్రమాదిత్య మోత్వానీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ.. "పుష్ప-2 నిస్సందేహంగా బ్లాక్ బస్టర్ మూవీ. కానీ 3 గంటల 20 నిమిషాల నిడివి కారణంగా నార్మల్ కంటే థియేటర్లలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ను ఆక్రమిస్తోంది.

Update: 2024-12-12 03:45 GMT

అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప 2: ది రూల్" సినిమా, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. విడుదలైన 6 రోజుల్లోనే రూ.1002 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి, భారతీయ సినీ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఇక నార్త్ లో పుష్పరాజ్ హవా మామూలుగా లేదు. ఇప్పటికే హిందీలో అనేక రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు ₹500 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. చూస్తుంటే ఇప్పట్లో ఈ ప్రభంజనం ఆగేలా కనిపించడం లేదు. అయితే ఈ సినిమాకి మల్టీప్లెక్స్ లలో ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడం పట్ల దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే హ్యాపీగా లేరని తెలుస్తోంది.

లూటేరా, ఉడాన్, భవేష్ జోషి వంటి చిత్రాలను రూపొందించిన బాలీవుడ్ ఫిలిం మేకర్ విక్రమాదిత్య మోత్వానే.. ''పుష్ప 2'' నిర్మాతలు మల్టీప్లెక్స్‌లలో గుత్తాధిపత్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని అంగీకరిస్తూనే, మొదటి పది రోజుల పాటు మరే ఇతర చిత్రాన్ని ప్రదర్శించకూడదని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని విమర్శించారు. దీని కారణంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్-2025 కు నామినేట్ చేయబడిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రానికి స్క్రీన్స్ లభించలేదంటూ తన నిరాశను వ్యక్తం చేశాడు.

విక్రమాదిత్య మోత్వానీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ.. "పుష్ప-2 నిస్సందేహంగా బ్లాక్ బస్టర్ మూవీ. కానీ 3 గంటల 20 నిమిషాల నిడివి కారణంగా నార్మల్ కంటే థియేటర్లలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ను ఆక్రమిస్తోంది. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు వేరే చిత్రాన్ని వేయకూడదని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని, వేరే సినిమా కోసం ఒక్క షో వేసినా తమపై మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఓ ప్రముఖ మల్టీప్లెక్స్‌ చైన్ మేనేజర్ చెప్పాడు" అని పేర్కొన్నారు.

"ఏమైనప్పటికీ, ఇదొక భయంకరమైన ఉదాహరణ. మల్టీప్లెక్స్‌లను ఈ విధంగా గుత్తాధిపత్యం చేయకూడదు. ప్రతి పెద్ద సినిమా ఇలా చేయడం మొదలుపెడితే అది వినాశకరంగా మారుతుంది" విక్రమాదిత్య అన్నారు. అంతకుముందు 'పుష్ప 2' షోలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పంచుకుంటూ "ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ డైరెక్టర్ పాయల్ యొక్క అద్భుతమైన విజయాలు మనందరికీ అవసరం లేదు. ఎందుకంటే మనం ఆమె సినిమాను బయటికి విసిరేస్తాం. ప్రేక్షకులు చూడటానికి థియేటర్లు ఇవ్వం.. ఊపిరి పీల్చుకోనివ్వం. కానీ ఒక చిత్రానికి మాత్రం ఒకే మల్టీప్లెక్స్‌లో రోజుకు 36 షోలు వేస్తాము. అభినందనలు. మేము దీనికి అర్హులం" అంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు.

నిజానికి 3 గంటల 20 నిమిషాల రన్‌టైమ్ కారణంగా మల్టీఫ్లెక్స్ లలో ఒక షో తక్కువ పడుతుంది. విక్రమాదిత్య మోత్వానీ పెట్టిన పోస్టులో వాస్తవం ఉన్నప్పటికీ, నిడివి కారణంగా ఇక్కడ 'పుష్ప 2' సినిమాకే నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఎవరైనా ఏ థియేటర్ లేదా మల్టీప్లెక్స్‌లో అయినా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా సక్సెస్ అయిన చిత్రాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడతారు. అందులోనూ నార్త్ లో అల్లు అర్జున్ సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

'పుష్ప 2' చిత్రానికి ఆడియన్స్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టే, అధిక స్క్రీన్స్ లో ఎక్కువ షోలు వేస్తున్నారు. కాబట్టి ఆ విషయంలో మోనోపోలీ అంటూ ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. ఈ సినిమా వచ్చిన తర్వాత అక్కడక్కడా కొన్ని ధియేటర్లలో రన్ అవుతున్న 'సబర్మతి రిపోర్ట్', 'భూల్ భూలయ్యా 3', 'సింగం ఎగైన్' వంటి చిత్రాలకు టిక్కెట్లు తెగలేదనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. ఇప్పటికైతే హిందీలో పుష్పరాజ్ కు తిరుగు లేదు. 'బేబీ జాన్' సినిమా వచ్చే వరకూ అన్ని ఏరియాలలో ఈ సినిమా హవానే కనిపించనుంది. ఆ తరవాత ఎలా ఉంటుందనేది వచ్చే సినిమాని బట్టి ఉంటుంది.

ఇదిలా ఉంటే, పుష్ప సీక్వెల్ లెన్త్ ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు షోల కౌంట్ కూడా తగ్గిందని అనుకోవాలి. అంటే దాని కారణంగా అక్కడ ఎంతో కొంత ధియేటర్ రెవెన్యూ లాస్ అవుతున్నట్లే లెక్క. 'యానిమల్' మూవీ నిడివి 3 గంటల 21 నిమిషాలు ఉండటం వల్ల ఫస్ట్ వీకెండ్ లోనే రూ.30 - 40 కోట్ల వరకూ కోల్పోయినట్లుగా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Tags:    

Similar News