ఆ స్టార్ హీరో ప్రారంభానికి ముందే రికార్డ్!
63వ చిత్రం కోసం విక్రమ్ ఏకంగా 50 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడుట.
చియాన్ విక్రమ్ 63వ చిత్రం మడోన్ అశ్విన్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. 'మండేలా', 'మావీరన్' విజయాల తర్వాత శివ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 'తంగలాన్' విజయం తో విక్రమ్ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. దీంతో చియాన్ 63వ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే 'పొన్నియన్ సెల్వన్', 'తంగలాన్ విజయం విక్రమ్ రేంజ్ ని అమాంతం పెంచినట్లు కనిపిస్తుంది.
63వ చిత్రం కోసం విక్రమ్ ఏకంగా 50 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడుట. దీంతో విక్రమ్ కెరీర్ లో ఇదే హాయ్యెస్ట్ రెమ్యునరేషన్ అవుతుంది. ఇంత వరకూ విక్రమ్ 30-40 కోట్ల మధ్యలోనే తీసుకున్నారు. చాలా సినిమాలకు ఆయన తీసుకున్న పారితోషికం 30 కోట్ల లోపే ఉంటుంది. ముఖ్యంగా శంకర్ సినిమాలకు అత్యధిక పారితోషికం తీసుకు న్నట్లు గత కథనాలు చెబుతున్నాయి. ఇప్పుడా రికార్డులన్నింటి 63వ చిత్రం పారితోషికంతో చెరిగిపోయింది.
ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. విక్రమ్ కి జోడీగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని చూస్తున్నారు. అలాగే కీలక పాత్రలకు పేరున్న నటుల్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విక్రమ్ 'వీర ధూర శూరన్' రెండవ భాగంలో నటిస్తున్నాడు.
ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు మంచి హైప్ తీసుకొచ్చాయి. ఈ సినిమా ప్రచారం పనులు విక్రమ్ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత 63వ చిత్రం పనుల్లో బిజీ అవుతారు. మరి ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారా? రీజనల్ మార్కెట్ ని దృష్టి లో పెట్టుకుని చేస్తున్నారా? అన్నది తెలియాలి. శాంతి టాకీస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇదే సంస్థలో మడోన్ శివ పనిచేయడం రెండవ సారి.