డ్రగ్స్ తీసుకుని ఆ హీరో ఇబ్బంది పెట్టాడు
తాజాగా మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.;
పైకి ఎంతో అందంగా, నవ్వుతూ కనిపించే హీరోయిన్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ఇబ్బందులు, వారు పడిన బాధల్ని అందరూ బయటకు చెప్పుకోలేరు. బయటకు చెప్తే పరువు పోతుందేమోనని కొందరు అనుకుంటే, అలా అందరికీ చెప్తే ఆఫర్లు రావనే భయంతో మరికొందరు చెప్పరు. కొందరు మాత్రమే తాము పడిన ఇబ్బందుల్ని బయటకు చెప్పగలుగుతారు.
తాజాగా మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ఓ హీరో సినిమా సెట్స్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని సోనీ తెలిపింది. డ్రగ్స్ తీసుకుని షూటింగ్ కు వచ్చి తనతో మిస్ బిహేవ్ చేశాడని, ఓసారైతే తన ముందే బట్టలు మార్చుకోవాలని ఒత్తిడి చేశాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది విన్సీ.
ఆ హీరో అందరి ముందే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మాట్లాడేవాడని, తన లైఫ్ లోనే అదొక అసహ్యకరమైన సంఘటన అని చెప్పిన విన్సీ ఇక మీదట డ్రగ్స్ అలవాటున్న నటులతో కలిసి యాక్ట్ చేయకూడదని డిసైడ్ అయినట్టు తెలిపింది. దీని వల్ల తనకు అవకాశాలు తగ్గుతాయని తెలిసి కూడా తాను ఈ విషయాన్ని బయటపెడుతున్నానని విన్సీ వెల్లడించింది.
తనతో అలా ప్రవర్తించిన హీరో గురించి అందరికీ తెలుసని, కానీ ఎవరూ దాని గురించి రెస్పాండ్ అయి మాట్లాడింది లేదని విన్సీ బాధ పడింది. డ్రగ్స్ తీసుకోవడం అతని వ్యక్తిగతమైనప్పటికీ, వారి ప్రవర్తన వల్ల తోటి వ్యక్తులు ఇబ్బందులు పడతారని, ఇది ఎవరికీ మంచిది కాదని విన్సీ తెలిపింది. 2019లో రేఖ సినిమాతో వెండితెరకు పరిచయమైన విన్సీ, మొదటి సినిమాతోనే మలయాళ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది.
విన్సీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం మల్లూవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో ఎంతోమంది కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ స్పష్టం చేయగా, ఇప్పుడు విన్సీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. అయితే విన్సీ చెప్పినవన్నీ ఒక్క ఆమెకే పరిమితమా లేదా ఆ సమస్యతో ఇంకా చాలా మంది ఇబ్బంది పడ్డారా అనేది తెలియాల్సి ఉంది.