చర్యలు పక్కా.. అన్నీ బయట పెట్టండి: విశాల్

తమిళ ఇండస్ట్రీలో కూడా పది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

Update: 2024-09-16 22:30 GMT

మాలీవుడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్.. కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు నటీనటులు స్పందించి.. తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కోలీవుడ్ హీరో విశాల్ రీసెంట్ గా రెస్పాండ్ అయ్యారు. తమిళ ఇండస్ట్రీలో కూడా పది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

ఆ తర్వాత నటి రోహిణి ఛైర్‌ పర్సన్‌ గా కమిటీ ఏర్పాటు అయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో విశాల్.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఎదురైనా.. ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ తమ సమస్యలు చెబితే.. సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (నడిగర్‌ సంఘం) తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆ అసోసియేషన్ కు విశాల్.. జనరల్ సెక్రటరీగా ఉన్న విషయం తెలిసిందే.

తమ దృష్టిలో మహిళలు, పురుషులు ఎవరైనా ఒక్కటేనని విశాల్ తెలిపారు. ఫిర్యాదు చేస్తే.. మళ్లీ సినిమా అవకాశాలు రావేమోనని భయపడవద్దని చెప్పారు. తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టాలని కోరారు. ఒకరు ధైర్యంగా ముందుకు వస్తే.. మిగతా వారు కూడా అంతే ధైర్యంతో వచ్చి మాట్లాడుతారని అన్నారు. ఎక్కడ.. ఎప్పుడు.. ఎలాంటి ఘటన జరిగినా.. వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు, లైంగిక వేధింపులు సహా ఎన్నో విషయాల గురించి అనేక ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నారని విశాల్ అన్నారు. అలా కాకుండా వెంటనే చెబితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నడిగర్ సంఘంలో సభ్యత్వం లేకపోయినా పర్లేదని.. ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. సదరు బాధితుడు లేదా బాధితురాలు ఎవరిపైన ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అది సీనియర్ యాక్టర్ అయినా.. కొత్త యాక్టర్ అయినా.. దర్శకుడు అయినా.. నిర్మాత అయినా.. ఎవరైనా.. తమకు ఇబ్బంది కలిగిస్తే ఫిర్యాదు చేయాలని విశాల్ కోరారు. అదే సమయంలో బీ టౌన్ లో మహిళల రక్షణ గురించి ఎలాంటి ప్రస్తావన లేదేంటి అన్న ప్రశ్నపై విశాల్ స్పందించారు. అక్కడ కూడా ఎవరైనా వేధింపులు ఎదుర్కొంటే నిజాలను బయటపెట్టేందుకు ఇదే కరెక్ట్ టైమ్ అని వ్యాఖ్యానించారు విశాల్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Tags:    

Similar News