"విశ్వంభర" ఫస్ట్ సింగిల్ అప్డేట్
చిరూ- వశిష్ట కాంబినేషన్ లో సినిమా అనగానే అందరికీ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.;

భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్త వహించి బాగా టైమ్ తీసుకుని మరీ తర్వాతి సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకున్నాడు. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది.
చిరూ- వశిష్ట కాంబినేషన్ లో సినిమా అనగానే అందరికీ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే ఫస్ట్ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. కానీ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. టీజర్ లోని వీఎఫ్ఎక్స్ అసలు బాలేవని సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వినిపించాయి.
ఈ నేపథ్యంలో సినిమా కాస్త లేట్ గా రిలీజైనా పర్లేదనుకుని మేకర్స్ సినిమాను వాయిదా వేసి వీఎఫ్ఎక్స్ వర్క్స్ బాధ్యతల్ని మరో కంపెనీకి అప్పగించి అంతా సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. విశ్వంభరను వాయిదా అయితే వేశారు కానీ మళ్లీ కొత్త రిలీజ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేసింది లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ అప్డేట్ నెట్టింట వినిపిస్తోంది.
విశ్వంభర ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర నుంచి సాంగ్ ను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఆ సాంగ్ ను కృష్ణా జిల్లా నందిగామలోని పరిటాల ఆంజనేయ స్వామి గుడి వద్ద రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి విశ్వంభరకు సంగీతం అందిస్తున్నారు. విశ్వంభరకు కీరవాణి నెక్ట్స్ లెవెల్ ట్యూన్స్ ను ఇచ్చారని, ఆడియన్స్ కు ఆ సాంగ్స్ కచ్ఛితంగా నచ్చడంతో ఆ సాంగ్స్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పిస్తాయని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ట చెప్పి పాటలపై హైప్ పెంచాడు. దీంతో ఈ సాంగ్ ఎలా ఉంటుందో అని వినడానికి మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విశ్వంభరలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.