నటుడిగా గడ్డుకాలంలో వ్యాపారం ఆదుకుంది: వివేక్ ఒబెరాయ్
తాను విజయవంతమైన చిత్రాలను అందించినప్పటికీ ఆశాజనకమైన అవకాశాలను అందుకోలేదని, దాంతో తాను క్రియాశీల వ్యాపారవేత్తగా మారానని ఒబేరాయ్ ఇంతకుముందు వెల్లడించాడు.
రక్త చరిత్ర ఫేం వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ లో అగ్రనటుడి హోదాను అందుకున్న సంగతి తెలిసిందే. క్రిష్ 3, పఠాన్ సహా ఎన్నో బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో అతడు నటించాడు. కానీ అతడు కూడా ఒకానొక దశలో పూర్తిగా కెరీర్ పరంగా డౌన్ ఫాల్‌ని ఎదుర్కొన్నాడు. ఐశ్వర్యారాయ్‌తో డేటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ నుంచి బెదిరింపులను ఎదుర్కొనడమే గాక, సినీపరిశ్రమలో నటుడిగా అవకాశాలు తగ్గిపోయాయని ప్రచారమైంది. తాను విజయవంతమైన చిత్రాలను అందించినప్పటికీ ఆశాజనకమైన అవకాశాలను అందుకోలేదని, దాంతో తాను క్రియాశీల వ్యాపారవేత్తగా మారానని ఒబేరాయ్ ఇంతకుముందు వెల్లడించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివేక్ ఒబెరాయ్ తండ్రి సురేష్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. తన కుమారుడు బాలీవుడ్ లో కష్టకాలాన్ని ఎదురొడ్డి పోరాడిన తీరు ఎంతో స్ఫూర్తివంతమైనదని, అతడి ప్రయత్నాలను తాను సమర్థించానని తెలిపారు.
రోహిత్ శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా _శిల్పా శెట్టితో కలిసి చివరిసారిగా కనిపించిన ఒబెరాయ్ తాను నటిస్తూనే వ్యాపారం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్‌లో సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు తాను వ్యాపారంపై దృష్టి సారించానని, సినిమాలు, ఈవెంట్‌ల ద్వారా తనకు వచ్చే ఆదాయం చివరకు తగ్గిపోయిందని అన్నారు.
తాజాగా మీడియాతో ఒబెరాయ్ మాట్లాడుతూ.. తన నటనా వృత్తిని ప్రారంభించే ముందు అమెరికాలో తన తదుపరి చదువులకు నిధులు సమకూర్చడానికి తగినంత డబ్బు సంపాదించడం, ఆదా చేయడంపై దృష్టి పెట్టానని తెలిపాడు. తన ఆదాయాలు పెరిగేకొద్దీ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించానని, దాని కోసం స్టాక్ బ్రోకర్ల నుండి శిక్షణ పొందానని అతడు చెప్పాడు. సుమారు 16 లేదా 17 సంవత్సరాల వయస్సులో స్టాక్ మార్కెట్ పోర్ట్‌ఫోలియోను ప్రారంభించానని తెలిపాడు.
వివేక్ తన నటనా జీవితంలో అగ్రస్థానంలో ఉన్నప్పుడు కూడా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం కొనసాగించాడు. నేను కొంత గ్యాప్ తర్వాత తిరిగి వచ్చి నటుడిని అయ్యాను.. ఆర్జీవీ కంపెనీలో నటించాను. `సాథియా`లో అవకాశం వచ్చింది. జీవితం బాగుంది.... కానీ నేను ఎప్పుడూ పెట్టుబడిదారుడిగానే ఉన్నాను. వ్యాపారాలు చేస్తూనే ఉన్నాను. నేను చురుకైన వ్యాపారవేత్తగా మారాను. ఇది నాకు సహాయపడింది అని తెలిపాడు. తన నటనా జీవితంలో అనిశ్చిత సమయాల్లో తన బలమైన స్థిరమైన వ్యాపారం ఆర్థిక భద్రతను అందించిందని వివేక్ వెల్లడించారు. ఇప్పటి వరకు 29 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టానని తెలిపారు.
కాలేజీ టైమ్‌లోను సంపాదన..
ఒబెరాయ్ తాను నటనను కొనసాగించే ముందు వ్యాపారంలోకి ప్రవేశించినట్లు వెల్లడించాడు. 15 ఏళ్ల వయసులో తన తండ్రి సురేష్ ఒబెరాయ్ ఇచ్చిన రూ.500తో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించానని పేర్కొన్నాడు. బాలుర బోర్డింగ్ స్కూల్ నుండి వచ్చిన అతడు మిథిబాయి కాలేజీలో చాలా మంది అందమైన అమ్మాయిలను చూశాడు. తన భత్యాన్ని(తిండి ఖర్చులు) డేటింగుల కోసం ఖర్చు చేశాడు.
బాధ్యతారహితంగా ఖర్చు చేసినందుకు నాన్నగారు తిట్టిన తరువాత తన తండ్రి డబ్బుపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాడు. టీ, రిక్షా రైడ్‌ల కోసం.. అలాగే తన కళాశాల ఖర్చులకు మద్దతుగా వాయిస్ గిగ్స్ ద్వారా, అలాగే హోస్టింగ్ చేయడం ద్వారా సంపాదించాడు.