సూప‌ర్‌హీరో మూవీలో వామిక‌ జాక్‌పాట్?

సూపర్ హీరో సినిమాలో రణ్‌వీర్ సింగ్ స‌ర‌స‌న క‌థానాయిక‌ పాత్రకు వామికా పోటీప‌డుతోంద‌ని బ‌లంగా టాక్ వినిపిస్తోంది.

Update: 2025-01-11 21:30 GMT

2025 ప్ర‌ముఖ బాలీవుడ్ క‌థానాయిక వామిక గ‌బ్బికి ప్ర‌త్యేక సంవ‌త్స‌రం కానుంది. ఈ ఏడాదిలో రెండు భారీ ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది వామిక‌. వీటిలో ఒక‌టి అక్ష‌య్ కుమార్ తో భూత్ బంగ్లా. మ‌రొక‌టి ర‌ణ‌వీర్ సింగ్ స‌ర‌స‌న సూప‌ర్ హీరో సినిమాలో న‌టించే వీలుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. బాలీవుడ్ లో ఒక్కో సినిమాతో త‌న‌దైన ముద్ర వేస్తూ వామిక గ‌బ్బి అగ్ర హీరోయిన్ రేసులోకి చేరుకుంది. ఇటీవ‌ల చాలామంది సీనియ‌ర్ న‌టీమ‌ణుల‌కు ద‌క్కాల్సిన ఛాన్సుల్ని ఈ కుర్ర‌బ్యూటీ త‌న ఖాతాలో వేసుకుంటోంది.

అక్షయ్ కుమార్ 'భూత్ బంగ్లా' షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ప్రస్తుతం జైపూర్‌లో భూత్ బంగ్లా షూటింగ్‌లో ఖిలాడీ అక్ష‌య్ పాల్గొంటున్నారు. ఇప్పుడు వామికా గబ్బి అతడితో సెట్స్‌లో చేరింది. తాజాగా వామికా గబ్బి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. 'దిల్ కా దర్వాజా ఖోల్ దో నా డార్లింగ్' చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది, జయా బచ్చన్‌లతో కలిసి వామిక న‌టిస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్ - సమంతా రూత్ ప్రభు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న 'రక్త్ బ్రహ్మండ్' వెబ్ సిరీస్‌లో కూడా భాగం కానుంది. నాని స‌ర‌స‌న ఓ త‌మిళ చిత్రంలో న‌టించ‌నుంద‌ని టాక్ ఉంది.

అయితే వీట‌న్నిటిలో సూప‌ర్ హీరో మూవీలో ఆఫ‌ర్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు బాసిల్ జోసెఫ్ తెర‌కెక్కించ‌నున్న‌ సూపర్ హీరో సినిమాలో రణ్‌వీర్ సింగ్ స‌ర‌స‌న క‌థానాయిక‌ పాత్రకు వామికా పోటీప‌డుతోంద‌ని బ‌లంగా టాక్ వినిపిస్తోంది. ఒక‌వేళ పరిస్థితులు అనుకూలిస్తే వామికా ఈ పాత్రను దక్కించుకునే అవకాశం ఉంది. గతంలో బాసిల్ జోసెఫ్ తెర‌కెక్కించిన‌ మలయాళ చిత్రం 'గోధా'లో నటించింది, దీంతో వామిక సూప‌ర్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేయ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News