గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్‌పై వెబ్ సిరీస్?

సెల‌బ్రిటీల్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. స్నేహితుడిని చంప‌డం ద్వారా సల్మాన్ ఖాన్‌ని డైరెక్టుగా బెదిరించ‌డంతో అత‌డి పేరు మార్మోగుతోంది.

Update: 2024-10-18 16:57 GMT

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌ని చంపేస్తానంటూ ద‌డ పుట్టిస్తున్నాడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్. అంత‌కుముందే హెచ్చ‌రిక‌గా రాజకీయ నాయకుడు, స‌ల్మాన్ స్నేహితుడు బాబా సిద్ధిక్‌ను హత్య చేసాడు. ఈ ప‌రిణామంతో ముంబై అట్టుడికిపోయింది. సెల‌బ్రిటీల్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. స్నేహితుడిని చంప‌డం ద్వారా సల్మాన్ ఖాన్‌ని డైరెక్టుగా బెదిరించ‌డంతో అత‌డి పేరు మార్మోగుతోంది. తాజా స‌మాచారం మేర‌కు.. లారెన్స్ బిష్ణోయ్ జీవిత‌క‌థ‌ను వెబ్ సిరీస్ గా రూపొందించేందుకు స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి. జానీ ఫైర్‌ఫాక్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ సంస్థ‌ త్వరలో గ్యాంగ్ స్ట‌ర్ జీవితం ఆధారంగా `లారెన్స్ - ఎ గ్యాంగ్‌స్టర్ స్టోరి` అనే వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తోంద‌ని న్యూస్ 18 వెల్ల‌డించింది.

ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్‌పై సిరీస్ టైటిల్‌ను ఆమోదించినట్లు స‌ద‌రు మీడియా హౌస్ వెల్ల‌డించింది. ఒక సాధార‌ణ‌ యువ‌కుడు భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా మారిన క్ర‌మాన్ని ఈ వెబ్ సిరీస్ లో చూపించ‌నున్నారు. స‌ల్మాన్ తో అత‌డి వైరం దేనికోసం? ఎప్ప‌టి నుంచి వారి మ‌ధ్య వైరం మొద‌లైంది? అత‌డి నేర చ‌రిత్ర ఏమిటి? ఇలా అన్ని కోణాల్లో ఈ వెబ్ సిరీస్‌ని ఆవిష్క‌రించ‌నున్నారు. లారెన్స్ బిష్ణోయ్ 2014 నుండి జైలులో ఉన్నాడు. అయితే అతడు దేశంలో, విదేశాలలో క్రిమినల్ నెట్‌వర్క్‌ను నిర్వహించడంలో ఘ‌నుతికెక్కాడు.

ప్రొడక్షన్ హౌస్ హెడ్ అమిత్ జానీ ఓ స‌మావేశంలో మాట్లాడుతూ.. నిజమైన జీవిత కథను డ్ర‌మ‌టిక్ గా తెర‌కెక్కించి, ప్రేక్షకులను కట్టిపడేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను! అని తెలిపారు. నిర్మాత అమిత్ గతంలో `ఎ టైలర్ మర్డర్ స్టోరీ`, కరాచీ టు నోయిడా వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాల‌ను నిర్మించారు. లారెన్స్ బిష్ణోయ్ జీవితంలోని ఘ‌ట‌న‌ల‌తో వెబ్ సిరీస్ ని ఏ విధంగా రూపొందించ‌నున్నారో చూడాల‌న్న ఉత్కంఠ నెల‌కొంది.

Tags:    

Similar News