ఈ వారానికి ‘తమిళమే’ ముద్దు
సంక్రాంతి సందడి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ పడుతూ లేస్తూ సాగుతోంది. పండుగ సీజన్ తర్వాత డల్ అయిన బాక్సాఫీస్.. ‘తండేల్’తో పుంజుకున్నట్లే కనిపించింది.
సంక్రాంతి సందడి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ పడుతూ లేస్తూ సాగుతోంది. పండుగ సీజన్ తర్వాత డల్ అయిన బాక్సాఫీస్.. ‘తండేల్’తో పుంజుకున్నట్లే కనిపించింది. కానీ ఆ వీకెండ్ అయ్యాక మళ్లీ కథ మామూలే. గత వారం వచ్చిన ఏ సినిమా మెప్పించలేకపోయింది. జనం అంతో ఇంతో ‘తండేల్’ సినిమానే చూశారు. ఇక ఈ వారం విషయానికి వస్తే.. బాక్సాఫీస్‌కు కళ తెచ్చే చిత్రాలేవీ కనిపించడం లేదు. తెలుగులో మూణ్నాలుగు సినిమాలు రిలీజవుతున్నా.. వాటికి పెద్దగా బజ్ కనిపించడం లేదు. బ్రహ్మాజీ ముఖ్య పాత్ర పోషించిన ‘బాపు’ ట్రైలర్‌తో ఆకట్టుకున్నప్పటికీ.. దీనికి పెద్దగా హైప్ లేదు. ధనరాజ్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ‘రామం రాఘవం’ పరిస్థితీ అంతంతమాత్రమే. టాక్ బాగుంటే ఈ సినిమాలు పుంజుకునే అవకాశముంది. మిగతా చిత్రాల గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు.
ఉన్నంతలో ఈ వారానికి డబ్బింగ్ సినిమాలే కొంత బజ్ తెచ్చుకున్నాయి. ‘లవ్ టుడే’తో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన తమిళ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ లీడ్ రోల్ చేసిన ‘రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్’ యూత్ దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో పాటు ధనుష్ దర్శకత్వం వహిస్తూ తన అక్క కొడుకును హీరోగా పరిచయం చేస్తూ తీసిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ కూడా ఓ మోస్తరుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాల ట్రైలర్లు యువతను ఆకట్టుకున్నాయి. వీటి పాటలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఇక హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్’కు దాని ప్రేక్షకులు దానికి ఉండనే ఉన్నారు. మొత్తానికి ఈ వారం డబ్బింగ్ సినిమాలే ఎక్కువ బిజినెస్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘తండేల్’కు మరో వీకెండ్ అడ్వాంటేజీ ఉండొచ్చు. వచ్చే వారం రానున్న సందీప్ కిషన్ మూవీ ‘మజాకా’కు మాత్రం మంచి బజ్‌యే ఉంది.